హింసాత్మక రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని.. ఆ తెలివితోనే పుంగనూరులో ఆయన ఇదేవిధమైన కుట్రను అమలు చేశాడని ఐటిశాఖ మంత్రి గుడివాడ అమర్నాద్ ఆరోపించారు. మంగళవారం ఆయన విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎంతమాటంటే అంతమాట అంటున్నారు. అయితే, ఆ ముగ్గురి కుట్రపూరిత ఆలోచనలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లకు తగిన బుద్ధిచెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. పోలీసుల్ని రెచ్చగొట్టడం, తద్వారా వారు ఫైరింగ్ ఓపెన్ చేస్తే..ఎవరో ఒకరు చనిపోతే.. మా పార్టీ కార్యకర్తల్ని అన్యాయంగా చంపారంటూ ఒక డ్రామాతో రాజకీయ లబ్ధి పొందాలనేది బాబు రాజకీయ పన్నాగం పన్నారన్నారు. మొన్న పుంగనూరు బైపాస్‌లో పోలీసులపై టీడీపీ దాడికి ముమ్మాటికీ చంద్రబాబునే కారకుడన్నారు. ఈ కేసులో అతనే ప్రథమ ముద్దాయని చంద్రబాబుపైనే రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.