నులి పురుగుల నివారణ ద్వారా పిల్లల ఆరోగ్యానికి పూర్తి రక్షణ లభిస్తుందని రక్తహీనత సమస్యలు తొలగిపోతాయని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. 1-19 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు 400 గ్రా. మాత్రలు వేయటం ద్వారా బంగారు భవిష్యత్తును అందించవ్చని హితవు పలికారు. ఆగస్టు 10న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో నిర్వహించబోయే కార్యక్రమాల నిమిత్తం బుధవారం తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆల్బెండజోల్ మాత్రలు వేయటం ద్వారా పిల్లల్లో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని, ఇతర అనేక ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,834 కేంద్రాల్లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దానిలో భాగంగా జిల్లా కేంద్రంలోని మహారాజ సంస్కృత కళాశాలలో గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్, డిప్యూటీ స్పీకర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నామని వెల్లడించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈ మేరకు అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని అవసరమైనంత మేరకు మాత్రలు సరఫరా చేశామని పేర్కొన్నారు.
ఒకే రోజు 3,60,974 మంది 1-19 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామని వివరించారు. అన్ని విభాగాల అధికారులు, ప్రజలు భాగస్వామ్యమై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.మిగిలిపోయిన వారికి 17వ తేదీన గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమంలో ఒక వేళ ఎవరైనా మందులు తీసుకోలేకపోయినట్లయితే వారి కోసం ప్రత్యేకంగా 17వ తేదీన ఆల్బెండజోల్ మాత్రలు అందజేస్తామని డీఎం&హెచ్‌వో స్పష్టం చేశారు. అలాగే ఏడాది లోపు వయసు కలిగిన చిన్నారులు, మూడు నెలల లోపు గర్బిణీలు ఈ మాత్రలను తీసుకోరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్న ఆవిష్కరించారు.సమావేశంలో డిప్యూటీ డీఎం&హెచ్వో డా. రవి కుమార్, డెమో చిన్నితల్లి, ఎపెడిమిక్ సెల్ ఇన్ఛార్జి సత్యరాజ్, ఆర్.బి.ఎస్.కె. ఇన్ఛార్జి లోక్‌నాథ్ ప్రశాంత్, రమణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.