అనకాపల్లి జిల్లాలో స్వచ్ఛమైన స్పష్టమైన ఓటర్ల జాబితా తయారీకి వివిధ రాజకీయ పార్టీలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఓటర్ల ఎన్రోల్మెంట్ అధికారి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి కోరారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క ఓటరు జాబితాలో నమోదు కావాలన్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు తొలగింపులు ప్రతివారం సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. రానున్న పది రోజులలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తికానుందని, జాబితా స్వచ్చీకరణ కొరకు గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ క్షుణ్ణమైన పరిశీలనతో జాబితా రూపొందించాలని ఆదేశించారు. ఓటు తొలగించే సమయంలో ఫారం 7 తప్పనిసరిగా ఉండాలని, బిఎల్ఓ రిపోర్టు ఉండాలని, స్పష్టమైన డాక్యుమెంట్లు ఉండాలని చెబుతూ ఏ వార్డులోనైనా రెండుకుమించి ఓట్లు తొలగింపు చేయవలసి వచ్చినప్పుడు ఈఆర్వో సమక్షంలో జరగాలన్నారు. రాజకీయ పార్టీల వారు ప్రతి వార్డుకు తమ బూత్ లెవెల్ ఏజెంట్ను నియమించి బూత్ స్థాయి అధికారికి సహకరించాలన్నారు. తమ ఓటు నమోదు చేసుకో వలసినదిగా విజ్ఞప్తి చేస్తూ విస్తృతమైన ప్రచారం చేయాలన్నారు. దీనిపై ప్రసార మాధ్యమాలలో ప్రకటనలు, గ్రామాలలో దండోరా వేయడం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, డిఆర్ఓ పి. వెంకటరమణ అనకాపల్లి నర్సీపట్నం ఆర్డీవోలు చిన్ని కృష్ణ, జయరాం, ఎస్డీసీలు ప్రమీల గాంధీ, అనిత, జ్ఞాన వేణి, రామలక్ష్మి రాజకీయ పార్టీలకు చెందిన కే హరినాథ్ బాబు వై ఎన్ భద్రం వి రాము బి శ్రీనివాసరావు ఎస్ రామచంద్రరావు జి శ్రీరామ్ ఏ సెక్షన్ సూపరెంట్ లక్ష్మీదేవి, డిటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.