ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వేకి కేవలం ఐదు రోజులే గడువు ఉందని, ఆ లోగా పని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఇంటింటి సర్వే పై నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటి సర్వేకి ఎక్కువ సమయం లేదని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ ఓటు కల్పించాలని, అలాగే అనర్హులందరినీ తొలగించాలని ఆదేశించారు. ఓటు తొలగించేటప్పుడు తప్పనిసరిగా ఫారమ్ 7 దరఖాస్తు తీసుకోవాలని, డెత్ సర్టిఫికేట్ లేదా ఏదో ఒక థృవపత్రం కూడా ఉండాలని, వాటిని ఫైల్ చేయాలని సూచించారు. ఒక కుటుంబ ఓట్లు, ఒక అపార్ట్మెంట్ లేదా గ్రూప్ హౌస్ ఓట్లు ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండేలా రేషనలైజేషన్ చేయాలని చెప్పారు.
విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో ప్రక్రియ కొంత నెమ్మదిగా సాగుతోందని, వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎటువంటి తప్పులు లేని, ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితాలను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ట్రైనీ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్డిఓలు ఎంవి సూర్యకళ, ఎం.అప్పారావు, శేషశైలజ, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు బి.సుదర్శనదొర, నూకరాజు, పద్మలత, నియోజకవర్గ కేంద్రాల తాశిల్దార్లు, డిటిలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు రొంగలి పోతన్న, శ్రీనివాసరెడ్డి, సతీష్‌కుమార్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.