అనకాపల్లి నుంచే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని, ప్రాణం పోయినా అవినీతి కి పాల్పడనని రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. స్థానిక న్యూకాలనీ లోని రోటరీ కళ్యాణ మండపంలో మంగళవారం సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన ప్రసంగం అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఎప్పుడు కూల్ గా సాగే ఆయన ప్రసంగం ప్రత్యర్థులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా కనిపించింది. సుదీర్ఘంగా సాగిన తన ప్రసంగంలో అమర్నాథ్ అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని, కార్యకర్తలే తన బలమని, చెప్పుడు మాటలు విని తనను దూరం చేసుకోవద్దు అంటూ భావోద్వేగంతో చేసిన ప్రసంగం పలువురిని ఆలోచింపజేసే విధంగా చేసింది.తన మీద నమ్మకం ఉంటే తనతోనే ఉండండి.తనను నమ్మిన వారిని ఎప్పుడూ దూరం చేసుకోను. పలకరించలేదనో. లేక పట్టించుకోలేదనో తనను దూరం చేసుకోవద్దు. నా గుండెల్లో తన తల్లిదండ్రులకు ఏ స్థానం ఉందో అంతకుమించి తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఉందని అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదవుల కేటాయింపులలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, ఆయా నాయకులు కార్యకర్తలు సంప్రదింపులు జరుపుకొని తన దగ్గరికి వచ్చిన తర్వాతే ఆయా పదవులనుభర్తీ చేశానని అమర్నాథ్ వెల్లడించారు.
ఇదిలావుంటే వచ్చే ఎన్నికల్లో తాను అనకాపల్లి నుంచే పోటీ చేస్తానని, కార్యకర్తలే నా ఎలక్షన్ నిర్వహణ బాధ్యతను తీసుకోవాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. రాజకీయా ల్లో ఓపిక అవసరమని, సమయం వచ్చినప్పుడు పదవులు అంది వస్తాయని ఆయన అన్నారు.ఇదిలావుంటే తాను అవినీతికి పాల్పడుతున్నట్లు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రాణం పోయినా అవినీతికి పాల్పడబోనని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కార్యకర్తలంతా కాలర్ ఎగరేసి మరీ చెప్పచ్చని అమర్నాథ్ అన్నారు. తానేదో భూ కుంభకోణానికి పాల్పడ్డానని అంటూ దాన్ని నిరూపించడానికి వచ్చిన ఒక సినిమా యాక్టర్, కేవలం నాలుగు నిమిషాలు ఇక్కడ ఉండి నిరూపించలేక పలాయనం చిత్తగించారని ఆయన అన్నారు. నోరు ఉందని ఇష్టానుసారంగా తనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని అమర్నాథ్ హెచ్చరించారు. తనపై అవినీతి మరక పడకూడదని, ఎదుటివారి వద్ద తలదించుకోకూడదన్న భావన తనలో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుందని అమర్నాథ్ స్పష్టం చేశారు.త్వరలోనే అనకాపల్లికి తాను మకాం మారుస్తానని అమర్నాథ్ తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బి.సి వెల్ఫేర్ గవర కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ఎపి ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిషోర్, అర్బన్ సచివాలయాల కన్వీనర్ కొణతాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.