అనకాపల్లి జిల్లాలో నవరత్నాలు - ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హత గల 6,217 మంది లబ్దిదారులకు వివిధ పథకాల క్రింద రూ.7 కోట్ల 58 లక్షల 49 వేల 019లు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు - ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి వివిధ కారణాల వల్ల లబ్ది అందని వారికి నగదు లబ్ధిని అందించడంలో భాగంగా వర్చువల్ ద్వారా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసారు. జిల్లా కలెక్టరు కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, జిఎస్ డబ్ల్యుఎస్ ప్రత్యేక అధికారి మంజులవాణి, డి ఆర్ డి ఎపిడి డైజీ లబ్దిదారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ద్వైవార్షిక మంజూరు కింద అర్హత ఉన్న 6, 217 మంది లబ్దిదారులను గుర్తించి వివిధ శాఖల అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కు చెందిన రూ.7,58,49,019లను లబ్దిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని చెప్పారు. ద్వైవార్షిక నగదు మంజూరులో భాగంగా 366 లబ్ధిదారులకు అమ్మఒడి రూ 54,90,000; 1895 మందికి చేదోడు పథకంలో రూ. కోటి 89 లక్షల 50 వేలు, 111 మందికి ఈ బీసీ నేస్తంగా 16 లక్షల 65 వేలు, మత్స్యకార భరోసా కింద 23 మందికి 2లక్షల 30 వేలు, విద్యా దీవెన కింద 1615 మందికి 2 కోట్ల 12 లక్షల 30 వేల 756, వసతి దీవెన కింద 1233 మందికి రూ. కోటి 7లక్షల 24 వేలు, వైయస్సార్ ఆసరాగా 579 మందికి రూ కోటి 57 లక్షల 93 వేల 263, వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ గా 395 మందికి 17 లక్షల 66 వేలు లబ్ధి చేకూరిందని వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిఎస్ డబ్ల్యుఎస్ ప్రత్యేక అధికారి మంజులవాణి, డి ఆర్ డి ఎపిడి డైజీ, డిఎల్ డివో ఉదయశ్రీ లబ్దిదారులు తదిత రులు పాల్గొన్నారు.