అర్హత గల ప్రతీ రైతుకు బోరు..
Ens Balu
3
మునసబుపేట
2020-09-28 19:09:31
శ్రీకాకుళం జిల్లాలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అర్హత గల ప్రతి రైతుకు బోర్ వేస్తామని మాజీ మంత్రివర్యులు , స్థానిక శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం మునసబుపేటలో వై.యస్.ఆర్.జలకళ వాహన ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా నీటియాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని జలకళ వాహనానికి పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు బోర్ వేయడం ఖరీదైన వ్యవహారమని, బోర్ వేసిన తర్వాత నీళ్లు పడకపోయినా ఖర్చులు మాత్రం చెల్లించాల్సి వచ్చేదన్నారు. అలాగే బోర్ పాడైపోయినా కూడా ఖర్చు వృధా అవుతుండేదని, ఇలాంటి భయంతో బోర్ వేయడానికి రైతన్నలు చాలా భయపడేవాళ్లని ఆయన గుర్తుచేసారు. మన రాష్ట్రంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని, కానీ బోర్ వేస్తే నీళ్లు పడతాయో లేదో, నీళ్లు వచ్చినా కరెంటు ఉంటాదో లేదో అన్న భయంతో రైతులు బోర్ వేయడానికి ఆసక్తి చూపేవాళ్లు కాదని అన్నారు. రాష్ట్రంలో ఉచితంగా రెండు లక్షల బోర్లు కొత్తగా వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, తద్వారా 3 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. దీంతో 5 లక్షల ఎకరాలకు అందుబాటులోకి సాగునీరు రానున్నట్లు ఆయన వివరించారు వైయస్ఆర్ జలకళ పథకం క్రింద రూ. 2500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు శాసనసభ్యులు గుర్తుచేసారు. వ్యవసాయ బోర్లు వేయడం ద్వారా వ్యవసాయం మరింత మెరుగవుతుందని,వేసవి పంటకు వైయస్ఆర్ జలకళ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో రైతులందరికీ ఈ పథకం గురించి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్.పి.చైర్మన్ ఎచ్చెర్ల సూరిబాబు, మాజీ జెడ్.పి.టి.సి. చిట్టి జనార్దన్, ఎ.ఎమ్.సి ఛైర్మన్ ముకళ్ల తాత బాబు, బరాటం రామశేషు, గుండ మోహన్, చిట్టి రవి, రంధి రాజారావు, బాన్నా నర్సింగరావు, బగ్గు అప్పారావు, గుండ హరీష్, కూర్మారావు, డ్వామా ఎ.పి.డి వెంకటరామన్, సిబ్బంది, వ్యవసాయ అధికారులు శ్రీకాకుళం, గార మండల పరిషత్ అధికారులు తదితరులు ఉన్నారు