హానికరమైన ఆహారపదార్ధాలకు దూరంగా ఉండాలి


Ens Balu
34
Bapatla
2023-08-26 10:46:33

రంగులు, రసాయనాలు వినియోగించి తయారు చేసే ఆహారపదార్ధాలకు విద్యార్ధులు దూరంగా ఉండాలని విద్యార్దుల జిల్లా సివిల్ సప్లయ్ అధికారి ఇ.బి. విలియమ్స్ సూచించారు. శనివారం సరస్వతి స్మారక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో  విద్యార్దులతో ఏర్పాటు చేసిన కన్సూమర్ క్లబ్స్ అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు మనం నగదు చెల్లించి కొనుగోలు చేసే వస్తువుల్లో కల్తీ పదార్ధాలు, నకిలీ వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. కొనుగోలు చేసే వస్తువులపై తయారీ సంస్థ పేరు, తయారు చేసిన తేదీ, వినియోగానికి చివరి తేదీ చూడాలని, కొనుగోలు చేసే ప్రతి వస్తువులు సేవలకు తప్పని సరిగా రశీదు పొందాలని తెలిపారు. తల్లిదండ్రులకు, చుట్టుప్రక్కల ఉన్నవారికి వినియోగాదారుల రక్షణ చట్టం గురించి వివరించాలని సూచించారు. ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద గ్యాస్ తూకం సరిచూసి తీసుకోవాలని, బిల్లులో ఉన్న మొత్తం మాత్రమే చెల్లించాలని, అధికంగా కోరితే పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1967 కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. 

వస్తువులపై ముద్రించిన ధరకన్నా అధిక ధరలకు వినియోగిస్తున్నట్లయితే తూనికలు కొలతల శాఖ వారికి ఫిర్యాదు చేయాలని, పండ్లు, కూరగాయలపై రంగులు రసాయనాలు వినియోగించే వారిపై, పరిశుభ్రత పాఠించకుండా ఆహారపదార్ధాలు తయారు చేసేవారిపై, విక్రయించే వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని వారు విద్యార్దులను కోరారు. సినిమా హీరోలు, సెలబ్రెటీలతో ఉన్న ప్రకటనలు చూసి వస్తువులను కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు.  వినియోగదాల రక్షణ చట్టం –2019 గురించి, విద్యార్ధులకు పవర్ పాయింట్ ద్వారా  దాసరి ఇమ్మానియేలు అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో బాపట్ల సివిల్ సప్లయ్ డిప్యూటీ తహశీల్దార్ ఓంకార్, ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, కన్స్యూమర్ క్లబ్ ఇన్చార్జి ఫాతిమున్నీసా, పాఠశాల ఉపాధ్యాయులు,  విద్యార్దులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ వారు రూపొందించిన మేము సైతం పుస్తకాన్ని పాఠశాలకు అందచేశారు.