నేషనల్ హైవే భూసేకరణ వేగవంతం..
Ens Balu
6
కలెక్టరేట్
2020-09-28 19:22:05
జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేసి ఆ సంస్దకు అప్పగించాలని సంయుక్త కలక్టరు డా. జి.సి. కిషోర్ కుమార్ భూసేకరణ అధికా రులకు ఆదేశించారు. సోమవారం ఆయన చాంబరులో రహదారుల భూసేకరణపై సమీక్షించారు. భారత్ మాల పరియోజనలో భాగంగా రాయపూర్ నుండి విశాఖపట్నం వరకు చేపట్టనున్నరహదారికి సంబంధించి భూసేకరణ పురోగతిపై భూసేకరణ అధికారి జయరావును అడిగారు. విజయనగరం గుండా వెళ్లె 95 కిలోమీటర్ల రహదారికి 595 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని, జిల్లాలోని 9 మండలాలకు సంబంధించిన 52 గ్రామాలలో భూసేకరణ జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే 84 కిలోమీటర్లకు పెగ్ మార్కింగ్ పూర్తయిందని, మెంటాడ, పాచిపెంట దగ్గర అటవీ భూమికి క్లియరెన్స్ కావలసివుందని వివరించారు. 13 గ్రామాలకు ఇప్పటికే డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందని, డిసెంబరు నెలాఖరు నాటికి భూసేకరణ పూర్తవుతుందని తెలిపారు. అయితే సర్వేయర్ల కొరత ఉందని తెల్పగా ముగ్గురు సర్వేయర్లను నియమిస్తానని తెలిపారు. అదేవిధంగా చెల్లూరు నుండి గొట్లాం వరకు నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డుకు సంబంధించి అదనంగా 36 ఎకరాలు అవసరం ఉందని ఈ భూమికి సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలని భూసేకరణ అధికారి ఆర్ డిఓ బిహెచ్. భవానిశంకర్ ను ఆదేశించారు. విశాఖపట్నం నుండి రాయపూర్ కు వేస్తున్న రోడ్డుకు సంబంధించి సాలూరు బైపాస్ రోడ్డుకు 35.47 హెక్టార్లు భూమికి సంబంధించి అవార్డు పాస్ చేయడం జరిగిందని, దానికి సంబంధించిన చెల్లింపులు పెండింగ్ ఉన్నాయని వెంటనే చెల్లించేలా చూడాలన్నారు. అదేవిధంగా కోమటిపల్లి-గజపతినగరం మధ్య చేపడుతున్న రహదారి, బౌడారా నుండి విజయనగరం రహదారికికి సంబంధించిన భూసేకరణ పనులపై కూడా సమీక్షించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల సంస్ద, ఆర్ అండ్ బి ఇంజినీర్లు, కలక్టరేట్ లేండ్ ఎక్విజిషన్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.