రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పద్మశాలి సామాజికవర్గాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని, రాజకీయంగా చేనేత వర్గాలను ఎదగనీయకుండా అగ్రవర్ణాలు ప్రయత్నం చేస్తున్నాయని పద్మశాలి గర్జనలో పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గాజువాకలో జరిగిన ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ సదస్సు లో విశాఖ జిల్లా అధ్యక్షుడు వానపల్లి ఈశ్వరరావు అధ్యక్షతన గాజువాక గర్జన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్బంగా అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత సామాజిక వర్గీయులంతా ఒకే తాటిమీదకి రావాలన్నారు. ఇప్పటివరకు మన చేనేత వర్గానికి రాజకీయంగా ఎదుగుదల లేదని, రానున్న రోజుల్లో చేనేతలు అందరూ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉంటేనే చేనేతలు ఎదగడానికి అవశాకశం వుంటుందన్నారు. మన కంటే తక్కువ శాతం వున్న బీసీల్లో అనేకమంది చట్టసభలకు వెళ్తున్నారని.. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా పద్మశాలీయులు, చేనేత కులస్తులు లేకపోవడం బాధాకరమన్నారు. మాజీ మంత్రి, నిమ్మల కృష్ణప్ప, రాజ్యసభ సభ్యులు జీవియల్ నర్సింహారావు, ఆప్కోస్ చైర్మన్ గంజి చిరంజివి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత , మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వావిరాళా సరళ దేవి, చేనేత కోఆర్డినేటర్ సూరిశెట్టి సూరిబాబు తదితరలు ప్రసంగించారు. జనాభాలో అధిక శాతం ఉన్న పద్మశాలి కులస్తులకు రానున్న ఎన్నికల్లో తగినన్ని ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు ఇచ్చిన వారికే తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా కుల సంఘం పెద్దలు తెలియజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి చేనేతలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.