డిసెంబరు నుంచి ఫోర్టిఫైడ్ రైస్..
Ens Balu
3
Vizianagaram
2020-09-28 19:24:30
పేదల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం సంకల్పించిన ఫోర్టిఫైడ్ రైస్‌ను డిసెంబరు నుంచి జిల్లా అంతటా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయా లని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ ఆదేశించారు. పౌర సరఫరా అధికారులు, మిల్లర్లతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి కిశోర్ మాట్లాడుతూ ప్రస్తుతం బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గాల్లో ఫోర్ట్‌ఫైడ్ రైస్ సరఫరా జరుగుతోందన్నారు. డిసెంబరు నుంచి మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈ బియ్యాన్ని సరఫరా చేయాలన్నారు. దీనికోసం జిల్లాలోని మిల్లర్ల సన్నద్దతపైనా, ఇతర సమస్యలపైనా సమీక్షించారు. జిల్లా అంతటా ఫోర్ట్‌ఫైడ్ రైస్ సరఫరా చేయాలంటే ఏడాదికి సుమారు లక్షా, 40వేల టన్నులు అవసరమని చెప్పారు. అయితే ఈ బియ్యాన్ని తయారు చేయాలంటే, సార్టెక్స్ మిల్లులు అవసరమని అన్నారు. ప్రస్తుతం 40 సార్టెక్స్ మిల్లులు జిల్లాలో ఉన్నాయని, మరో పది కొత్తగా సార్టెక్స్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈ 50 మిల్లులను పూర్తిస్థాయిలో వినియోగించుకొని, జిల్లా అవసరాలు తీర్చేవిధంగా ఫోర్ట్‌ఫైడ్ రైస్ ను ఉత్పత్తి చేయాలని జెసి ఆదేశించారు. అలాగే నవంబరు నుంచి ధాన్యం సేకరణకు సిద్దం కావాలని, అందుకు ఏర్పాట్లు మొదలు పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ వరకుమార్, ఎజిఎం కళ్యాణి, ఇతర అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.