సీఎం వైఎస్ జగన్ రైతు పక్షపాతి..మంత్రి గుండ్ల


Ens Balu
3
Anantapur
2020-09-28 19:28:14

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఆయన రైతు పక్షపాతి అని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వైయస్సార్ జలకళ  పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి పాల్గొని బోరుబావులను తవ్వే రిగ్గు వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించిన రిగ్గు ను మంత్రి ప్రారంభించగా, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు కూడా వేరువేరుగా వారి నియోజకవర్గాల వారీగా రిగ్గు బోర్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ పంట పొలాల్లో బోరు వేయడానికి పెట్టే ఖర్చులతో రైతులు అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకుండా, వారి పొలాల్లో బోర్లు వేసి సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం వైయస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా  రైతన్నల సాగునీటి కలలు నెరవేరుతాయన్నారు. వ్యవసాయానికి అవసరమైన నీటి కోసం బోరుబావులు వేసుకోవడం తలకు మించిన భారం అవుతుండడంతో రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, అవసరం ఉన్న వారందరికీ ఉచిత బోరుబావులను తవ్వించి ఇస్తానని తన పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు వాగ్దానం చేసి, ఆ మేరకు నవరత్నాలలో ఉచిత బోరుబావులను చేర్చి ప్రతి ఎకరాకు నీటి సదుపాయం ఏర్పాటు చేయడం కోసమే సీఎం వైయస్ఆర్ జలకళను ప్రారంభించినట్లు తెలిపారు. పాదయాత్ర లో రైతుల పొలాల్లో ఉచిత బోరుబావులను వేయిస్తామని హామీ ఇచ్చినా, ప్రస్తుతం ఉచితంగా మోటార్ల కూడా బిగిస్తామని చెప్పడం జరిగిందని, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుల పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తోందని, సీఎం రైతు పక్షపాతి అన్నారు. పాదయాత్రలో రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సంవత్సరాల కాలంలో సుమారు 2, 340 కోట్ల వ్యయంతో దాదాపు రెండు లక్షల బోరుబావులను ప్రభుత్వం అర్హులైన రైతుల భూముల్లో తవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పాటుపడుతోందని, ప్రతి ఎకరానికి సాగు నీరు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు మొహమ్మద్ ఇక్బాల్, వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పివి సిద్దారెడ్డి, ఉషా శ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, వై. వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం )గంగాధర్ గౌడ్,  మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ భాష, జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పామిడి వీరాంజనేయులు, ఉరవకొండ నియోజకవర్గం ఇన్చార్జి విశ్వేశ్వరరెడ్డి, ఆర్డీవో గుణ భూషణ రెడ్డి, డ్వామా అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.