జలకళను వినియోగించుకోవాలి..
Ens Balu
4
Anantapur
2020-09-28 19:49:38
రైతుల పొలాల్లో ఉచిత బోరుబావుల తవ్వకం కోసమే వైయస్సార్ జలకళను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,340 కోట్ల రూపాయల వ్యయంతో రెండు లక్షల బోరు బావులు తవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఈ పథకం ద్వారా దాదాపు మూడు లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని, 5 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. ఈ ఏడాది జిల్లాలో గత నాలుగు నెలల నుంచి 512 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయిందని, ఏడాదిపాటు కురవాల్సిన వర్షం ఈ నాలుగు నెలల్లోనే నమోదైందన్నారు. వర్షం ద్వారా 362 టీఎంసీల నీరు కురవగా, అందులో 12 శాతం అనగా 46 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకిందన్నారు. దీని ద్వారా భూగర్భజలం పెరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కి కలెక్టర్ వివరించారు. రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, జిల్లాలో ఎక్కడైతే నీళ్లు తోడడానికి అవకాశం ఉంటుందో అక్కడ వైయస్సార్ జలకళ కార్యక్రమం అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, డ్వామా అధికారులు, రైతులు పాల్గొన్నారు.