ఉమ్మడి విశాఖలో 70 మందికి కారుణ్య నియామకాలు


Ens Balu
52
Visakhapatnam
2023-09-05 14:10:15

ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా, నిస్వార్థంగా అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లికార్జున పేర్కొన్నారు. మంగళవారం విశాఖలోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ఉత్తర్వులను కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ‌అభ్యర్థులకు కలెక్టర్ అందజేశారు. ఉమ్మడి విశాఖపట్నం  జిల్లాలో సాధారణ కారుణ్య నియామకాలు క్రింద 70 మందికి, రెవెన్యూ శాఖ 9 మందికి, గ్రామ సచివాలయాలు 3 , ఆర్టీసీ 21 మంది , రెవెన్యూ శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు 43 మొత్తం 146 మందికి  నియామక పత్రాలు కలెక్టర్‌ అందజేశారు . ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈరోజు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో కలిపి 436 మందికి నియామక పత్రాలు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఉద్యోగంలో చేరిన తరువాత కూడా ఉన్నత విద్యనభ్యసించాలని, నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వారందరూ నిస్వార్ధంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా తమ విధులను నిర్వహించాలన్నారు. 

ఉద్యోగం పొందిన ప్రతి అభ్యర్థి చేసే పనిలో నైపుణ్యత, నాలెడ్జ్,  అవగాహన కలిగి ఉంటే ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారని... క్లిష్ట సమయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఏ పని అప్పగించిన బాద్యత యుతంగా  పనిచేసి ఉన్నతాధికారుల గుర్తింపు పొందాలని కలెక్టర్ అన్నారు. కుటుంబ బాధ్యతలను కూడా సరిగా నిర్వర్తించాలని కలెక్టర్‌ సూచించారు. జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు ప్రజలకు సేవ చేయాలని అన్నారు. సమయ పాలన పాటిస్తూ నిబద్దత, అంకిత భావంతో విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో ఎస్ శ్రీనివాసమూర్తి , ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ , కలెక్టరేట్‌ కార్యాలయ పరిపాలన అధికారి ఈశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు