ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం చాలా జాగ్రత్తగా పకడ్బందీగా నిర్వహించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి నియోజకవర్గాల ఎన్నికల అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు నియోజకవర్గాల ఇఆర్వోలు, ప్రత్యేక అధికారులతో ఎన్నికల అంశాలపై సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా తొలగించిన ఓట్లకు సంబంధించిన 3 రకాల రికార్డులను, ఓటర్ నోటీసులు, పంచనామా పత్రాల్లో అధికారుల సంతకాలు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1400 ఓటర్లకు మించకుండా ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి ఓటర్ ఇంటి నెంబర్ ఉండాలని, ఏ ఇంటి నంబరు ఏ పోలింగ్ కేంద్రంలో వస్తుందో పక్కాగా సమాచారం వుండాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల అనుసరించి ఓటర్ల జాబితాలో మూడు రకాలు అనగా మృతి చెందిన, శాశ్వతంగా వలస పోయిన, ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లకు సంబంధించి తొలగించిన ఓటర్ల రికార్డులను పరిశీలించడం జరుగుతుందని, వాటి పరిశీలనకు సిద్ధం చేయాలన్నారు.
తొలగించిన ఓటర్లకు సజావుగా నోటీసులు పంపించే ప్రక్రియ ముఖ్యంగా మృతి చెందిన ఓటర్లకు సంబంధించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పొందడం లేదా పంచనామా నిర్వహించి ఓట్లను తొలగించడం పక్కగా చేయాలన్నారు. బూతు స్థాయి అధికారుల నుండి ఏఈఆర్వోలు, ఈఆర్ఓలు, ప్రత్యేక అధికారులు, పూర్తిగా పరిశీలన చేయాలనే, చివరగా జిల్లా ఎన్నికల అధికారి పరిశీలనకు సిద్ధంగా ఉంచాలన్నారు. నియోజకవర్గ పరిధిలో తొలగించిన ఓట్లలో ఓటర్ల నమోదు అధికారి ఈఆర్వో1000 ఓట్లను, యాదృచ్ఛికంగా వివిధ పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించాలన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు 500 ఓట్లను, జిల్లా ఎన్నికల అధికారిగా 100 తొలగించిన ఓట్లను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పరిశీలించి సరైన పత్రాలతో దస్త్రాలు ఉన్నాయా లేదా గమనించడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, నియోజకవర్గం ఇఆర్వోలు భీమవరం దాసిరాజు, ఆచంట ఎస్ టి వి రాజేశ్వరరావు, నరసాపురం కే కృష్ణవేణి, పాలకొల్లు కే సి హెచ్ అప్పారావు, ఉండి జీవీకే మల్లికార్జునరావు, తణుకు జెడ్ వెంకటేశ్వరరావు, ప్రత్యేక అధికారులు జాషువా, ఆశా కిరణ్, ఎలక్షన్ సూపరింటెండెంట్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.