జగనన్నమార్గదర్శకత్వంలో వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న 'సామాజిక బస్సు యాత్ర' అన్ని వర్గాల ప్రజలనూ ఆప్యాయంగా కలుసుకునేందుకు నిర్వహిస్తు న్న కార్యక్ర మమని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వివరించారు. విజయదశమి సందర్భంగా తీసుకున్న భవానీ దీక్ష పూర్తయిన అనంతరం శుక్రవారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26 నుంచి ఉత్తరాంధ్రలో ప్రారంభమైన సామాజిక చైతన్య బస్సు యాత్ర లక్ష్యాన్ని ఎంపీ వివరించారు. తిరుపతిలో నిర్వహించే బస్సు యాత్రలో తాను పాల్గొనబోతున్నట్టు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో అణగారిన వర్గాలకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. కేవలం వారిని ఓట్ల బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు తప్పిస్తే సామాజిక, రాజకీయ, ఆర్థికంగా వారిని చైతన్య పరిచే ఏ ఒక్క కార్యక్రమాలను పాలకులు చేయలేదన్నారు.
ఎనభై శాతం ఓట్లున్న సామాజిక వర్గాన్ని వెనక్కి నెట్టేశారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమ న్యాయాన్ని పాటిస్తూ పాలన దిస్తున్నారని తెలిపారు. జగనన్న సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జడ్పీ ఛైర్మన్లు ఉంటే వాటిలో 9 అణగారిన వర్గాలకే ఇచ్చారన్నారు. బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 67 శాతం మంత్రి వర్గంలో అవకాశం కల్పించడం, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అవకాశాలు, సహాయం అందజేయడం జరుగుతోం దన్నారు. మహిళా బిల్లు మొన్ననే చట్టం కూడా అయిందని, దీనివల్ల మరింత చైతన్యం కలుగుతుందన్నారు. మరి ఇవన్నీ గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ఎంపీ ప్రశ్నించారు. ఎంత సేపూ ప్రజాధనాన్ని దోచుకోవడం, దాచుకోవడం..అడ్డంగా బొక్కేయడం తప్పిస్తే సామాన్యుల స్థితిగతులపై, వారి జీవన విధానాన్ని మెరుగుపర్చే ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదన్నారు. గతంలో సామాన్యులకు జరిగిన మోసాలు, దోపిడీని వివరిస్తూ వైఎస్సార్ సీపీ పాలనలో అన్ని వర్గాలకు చేసిన సామాజిక న్యాయాన్ని ఈ బస్సు యాత్రల ద్వారా వివరిస్తామని ఎంపీ భరత్ తెలిపారు.
సనాతన హైందవ ధర్మానికి ఏ మాత్రం చిన్నపాటి అవమానం జరిగినా విశేషంగా స్పందించే హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలు, సంఘాలు రాజమండ్రిలో టీడీపీ నిర్వహించిన కార్యక్రమంపై ఎందుకు స్పందచలేదని ఎంపీ భరత్ ప్రశ్నించారు. హిందువుల ఆరాధ్య దైవాలను రాక్షసులుగా చిత్రీకరిస్తూ 'జగనాసుర' వధ కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహిస్తే వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి.. ఇవన్నీ ఎందుకు నోరు మెదపలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. జగన్నాధుడు అంటే విష్ణుమూర్తి అంశం, అలాగే కృష్ణభగవానుడు నామమని..అటువంటి హిందూ దైవాలని రాక్షసులుగా చిత్రీకరించడం భారతీయులంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు. హిందూ దైవాలను రాక్షసులుగా చిత్రీకరించిన ఎవ్వరినీ ఉపేక్షించకూడదని, ఈ విషయమై లోక్ సభలో కూడా ప్రధానంగా ప్రస్తావిస్తానని ఎంపీ స్పష్టం చేశారు.