కులగణనపై కలెక్టర్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ


Ens Balu
6
Anakapalle
2023-11-15 11:41:22

అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేటి  మధ్యాహ్నం 2:30గంటల అభిప్రాయ సేకరణ జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి ఆధ్వర్యంలో చేపడుతున్నట్టు జిల్లా బి.సి., సంక్షేమ సాధికారత అధికారి కె. రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. సామాజికంగా, విద్యాపరంగా సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా రూపొందించడంతో పాటు అమలు చేయడం, సామాజిక విద్యా ఆర్థిక జీవనోపాధి జనాభా అంశాలకు సంబంధించిన కుల ఆధారిత సమగ్ర గణనను చేపట్టడం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినట్లు ఆమె తెలిపారు. ప్రతి కుల, వర్గ, సామాజిక, విద్య, ఆర్థిక, అభివృద్ధి వారి ప్రస్తుత స్థితిని తెలుసుకుంటామన్నారు. అణగారిన వ్యక్తుల లేదా ఆ వృత్తులను అనుసరిస్తున్న వారి సమస్యలను తెలుసుకుని వారి అభివృద్ధికి మెరుగైన విధానాల అమలు వ్యూహాలను రూపొందించేందుకు,  సున్నితమైన సమస్యలపై చర్చకు వీలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. 

సముచితమైన విధాన రూపకల్పన ద్వారా అట్టడుగు వర్గాల అభివృద్ధి అభ్యున్నతి కార్యక్రమాల ద్వారా ఏ కుల సమూహాలు ప్రయోజనం పొందాయో తెలుసుకుని వాటిపై దృష్టి పెట్టనున్నట్టు తెలియజేశారు. నిజమైన అర్హత కలిగి ఉండి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందని వారిని గుర్తించి వారికి లబ్ధి చేకూర్చనున్నామన్నారు. సామాజిక న్యాయం ద్వారా సమ సమాజాన్ని సాధించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను కులగణన కోసం వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, తదితర ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర సంఘాల నాయకులు, మేధావులు, విరివిగా పాల్గొని తమ అభిప్రాయాలను సలహాలు సూచనలను తెలియజేయాలని ఆమె కోరారు.