రుణాల లక్ష్యాలు అధిగమించాలి..


Ens Balu
4
Anantapuram
2020-09-28 20:46:33

 ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరు లక్ష్యాలను వేగవంతంగా సాధించేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని రెవిన్యూ భవనంలో పీఎం స్వానిధి, జగనన్న తోడు, స్టాండప్ ఇండియా, తదితర పథకాలపై బ్యాంకర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం స్వానిధి, జగనన్న తోడు, స్టాండప్ ఇండియా, వైయస్సార్ చేయూత, వైయస్సార్ భీమా తదితర పథకాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పీఎం స్వానిధి పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాలు పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పీఎం స్వానిధి కింద నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఆలస్యం తగదని, ప్రణాళికను సిద్ధం చేసుకుని వారం రోజుల్లోపు రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంకు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు.   జిల్లాలో జగనన్న తోడు పథకం కింద అర్హత కలిగిన చిరు వ్యాపారులకు రుణాల మంజూరు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ చిరువ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తిదారుల నుంచి 54,317 అప్లికేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ లు పూర్తి అయ్యాయని, అర్హత కలిగి ఎంపిక చేసిన వారికి సంబంధించి సకాలంలో ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున రుణాలను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో 29, 060 మంది లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 8 మందికి మాత్రమే రుణాలు మంజూరు అయ్యాయని, వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే స్టాండప్ ఇండియా కు సంబంధించి నవంబర్ 30 తేదీ లోపు జిల్లా వ్యాప్తంగా మూడువేల మంది పారిశ్రామిక వేత్తలకు 300 కోట్ల రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 482 బ్రాంచ్ లు ఉండగా, ఒక్కో బ్రాంచ్ కు సంబంధించి 6 మందికి రుణాలు అందించేలా యాక్షన్ ప్లాన్ నిర్ణయించి అప్లికేషన్లను సిద్ధం చేయాలన్నారు.  నవంబర్ లోపు లబ్ధిదారుల గుర్తింపు, అప్లికేషన్లు సిద్ధం చేయడం, వెరిఫికేషన్ పూర్తిచేయడం, రుణాలు మంజూరు చేయడం తదితర అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని బ్యాంకులు వందశాతం రుణాల మంజూరు లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా వైయస్సార్ బీమా, వైయస్సార్ చేయూత, ఆత్మ నిర్బర్ నిధి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్ తదితర పథకాలకు సంబంధించి రుణాల మంజూరు లక్ష్యాలను నిర్దేశిత సమయంలోపు సాధించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (గ్రామ /వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, సబ్ కలెక్టర్ నిషా0తి, అసిస్టెంట్ కలెక్టర్ జి, సూర్య, లీడ్ జిల్లా మేనేజర్ మోహన్ మురళి, డిఆర్డిఎ పిడి నరసింహారెడ్డి, నాబార్డ్ ఏజీఎం ఉషా మధుసూదన్, నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ పివిఎస్ఎన్ మూర్తి, వివిధ శాఖల అధికారులు, బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.