ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శక విధానాలు అవలంభించాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, విశాఖపట్టణం జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు (రోల్ అబ్జెర్వర్) జె.శ్యామలరావు ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా విమాన మార్గం ద్వారా సోమవారం ఉదయం ఆయన విశాఖపట్టణం చేరుకున్నారు. ఈ సందర్భంగా గాజువాక, పశ్చిమ, ఉత్తర అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాబితాలను, సంబంధిత రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. మార్పులు చేర్పులు, తొలగింపు, నోటీసుల జారీ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు, పోలింగ్ కేంద్రాల నిష్పత్తి, కొత్త ఓటర్ల చేరికలపై ఆరా తీశారు. గాజువాక నియోజకవర్గ పరిధిలోని అక్కిరెడ్డిపాలెంలో జడ్పీ హైస్కూళ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ముందుగా తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 154 నుంచి 162 వరకు గల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న పొరపాట్లు కూడా జరగడానికి వీలులేదని, జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మర్రిపాలెం సౌత్ రైల్వే ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని, ఉత్తర నియోజకవర్గ పరిధిలోని సీతమ్మధార పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఓటర్ల తొలగింపు విషయంలో జాగురూకత వహించాలని, డూప్లికేట్ ఓట్లను తొలగించే క్రమంలో నోటీసులు జారీ చేయాలని, సదరు ఓటరు అంగీకారం తీసుకున్న తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలని చెప్పారు. నోటీసులు జారీ చేసి సంబంధిత రశీదను భద్రంగా ఉంచాలని, రికార్డులను పక్కా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా జాబితా సవరణ ప్రక్రియను, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని చెప్పారు. పర్యటనలో ఆయన వెంట ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, ప్రత్యేక ఉప కలెక్టర్లు లక్ష్మారెడ్డి, అఖిల, తహశీల్దార్లు ఆనంద్ కుమార్, కె. జయ, శ్రీవల్లీ, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.