వైఎస్సార్సీపీకి మాజీమంత్రి దాడి ఫ్యామిలీ గుడ్ బై చెప్పేసింది. విభజన జిల్లా అనకాపల్లిలో బలమైన సామాజిక వర్గం నుంచి అంతకంటే బలమైన నాయకుడు పార్టీకి రాజీ నామా చేయడం ఇపుడు సంచలనంగా మారింది. దాడి వీరభద్రరావు ముఖ్యమంత్రికి తన రాజీనామా లేఖ పంపారు. తాను, తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టు ఏకవాక్యంతో రాజీనామా లేఖ ముగించారు మాజీమంత్రి. అయితే.. రాజీనామా కాపీని సజ్జల, విజయసాయి రెడ్డికి పంపుతూ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేరు ప్రస్తావించారు వీరభద్రరావు. టిడిపి నుంచి పార్టీ మారిన సమయంలో మంచి స్థానం ఇస్తారని అంత భావించారు. అయితే పార్టీ అభివృద్ధిలో దాడి మాటలకు విలువ ఇవ్వలే దనే మనోవేదన దాడి కుటుంబంలో ఆది నుంచీ ఉంది. అయితే పార్టీ మారిన వెంటనే ఈ విషయాన్ని బయటపెట్టలేకపోయింది దాడికుటుంబం. ఆ తరువాత రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ పదవి గానీ దక్కుతుందని కేడర్ బావించినా ఆ సహకారం కూడా అందలేదు. ఈ క్రమంలో కేడర్ నుంచి, కుటుంబ సభ్యులు, నాయకులు నుంచి నిరసన వ్యక్తం కావడంతో దాడి ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు వైఎస్సార్సీపి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామాచేయడం సంచలనం అయ్యింది.
దాడి వీరభద్రరావు.. 1985లో మొదటిసారి ఎన్టీఆర్ పిలుపు అందుకుని రాజకీయ అరంగేట్రం చేసి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1989, 1994, 19 99లలో వరసగా గెలిచారు. అలా నాలుగు సార్లు గెలిచి పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. అనకాపల్లి రాజకీయాలను శాసించారు. 2007 నుంచి 2012 దాకా ఎమ్మె ల్సీగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఆ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఓటమి చెందడంతో వైఎస్సార్సీపీకి దాడి కుటుంబం అంతే వేగంగా రాజీనామా చేసి బయటకు వచ్చారు. మళ్లీ 2019 ఎన్నికల ముందు తిరిగి వైఎస్సార్సీపీలో చేరి మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మె ల్యేగా గెలిపించేందుకు కృషి చేశారు.ఇపుడు 2024 ఎన్నికలకు ముందు దాడి కుటుంబ రాజీనామా పార్టీలో తీవ్రమైన చర్చకు తెరలేపింది. దాడి మళ్లీ టిడిపీలోకే వెళ్లే అవకాశాలున్నట్టు కనిపిస్తుంది. ఆయన టీడిపిలో చేరతారా లేదంటే ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుందనేది కూడా చర్చనీయాంశం అవుతోంది.