జనభాగీదారి కార్యక్రమాలను విజయవంతం చేయాలి


Ens Balu
25
Visakhapatnam
2024-01-08 14:52:51

అమ‌రావ‌తిలోని స్వ‌రాజ్ మైదానంలో జనవరి 19న 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించనున్న  నేప‌థ్యంలో జ‌న‌భాగీధారి పేరిట ఈ నెల 9-18 వరకు నిర్వహించనున్న జిల్లా స్థాయి చైత‌న్య కార్య‌క్ర‌మాల్లో అందరూ భాగస్వామై, విజయవంతం చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి కె. మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా మంగళవారం ఉద‌యం 7.00 గం.ల‌కు స్థానిక ఎల్.ఐ.సి బిల్డింగ్ స‌మీపంలోని అంబేద్క‌ర్ విగ్రహం నుంచి రామాటాకీస్ వ‌ద్దనున్న అంబేద్క‌ర్ భ‌వ‌న్ వ‌ర‌కు జిల్లాస్థాయి మార‌థాన్ నిర్వహించ‌నున్నట్లు చెప్పారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన జేకేసీ కార్యక్రమం అనంతరం డీఆర్ఓ జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మంగళవారం, బుధవారం, జనవరి 18న పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9న అంబేద్కర్ భవన్ లో ఉదయం 9 గం. ల నుండి రక్తదాన కార్యక్రమం, జిల్లా స్థాయి ఫోటో ఎగ్జిబిషన్, అంబేద్కర్ జీవిత చరిత్రపై తీసిన షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శనలు ఉంటాయన్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రదర్శనలకు బహుమతి ప్రధానం ఉంటుందని చెప్పారు. అలాగే 18న ఉదయం 9 గం.లకు ఎల్ఐసి భవనం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలంకరణ, మానవహారం, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలతో ప్రతిజ్ఞ కార్యక్రమాలు ఉన్నట్లు వివరించారు. అదే రోజు ఉదయం 11 గం.లకు అంబేద్కర్ భవన్ లో సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో జనవరి 9, 10 తేదీల్లో రక్తదాన కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు జిల్లా అధికారులు, వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది భాగస్వాములు అవుతారని తెలిపారు. రక్తదాన కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని చెప్పారు.