జగనన్న తోడు పథకం 8వ విడత కింద జిల్లాలో 13,244 మంది లబ్దిదారులకు రూ. 14 కోట్ల 1 లక్ష 33 వేలు లబ్దిదారుల ఖాతాలకు జమచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. గురువారం జగనన్న తోడు పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించినవారికి సంబంధించిన వడ్డీ రాయితీని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమచేసే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిరువ్యాపారులు, సాంప్రదాయ వృత్తులవారి ఉపాధికి ఊతంగా జగనన్న తోడు నిలుస్తోందన్నారు. అదే విధంగా జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించిన 18,376 మంది లబ్దిదారులకు రూ.30 లక్షల 66 వేల 863లు వడ్డీ రీయింబర్స్ మెంట్ కింద లబ్దిదారులకు జమచేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారం చేసుకొనే వారికి ఈ పథకం కింద అండగా నిలుస్తోం దని తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే తిరిగి వడ్డీలేని రుణాలు పొందవచ్చన్నారు. చిరువ్యాపారులు ఇతరులపై ఆధారపడి అధికవడ్డీల భారిన పడకుండా స్వయం ఉపాధితో జీవించే విధంగా వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ వారికి అండగా నిలబడుతూ ఆర్ధిక భరోసా అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ బి. వరాహ సత్యవతి గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి మంజులవాణి, డి ఆర్ డి ఎ పి.డి. శచీ దేవి, మెప్మా పిడి సరోజిని, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.