వారసత్వ సంపదను ప్రపంచానికి తెలియజేసేందుకే గిరిజన సాంస్కృతిక యాత్ర


Ens Balu
39
Visakhapatnam
2024-01-12 06:56:11

తూర్పు కనుమలలోని గిరిజనుల సంస్కృతి , సంప్రదాయాలు, వారసత్వ సంపదను ప్రపంచానికి తెలియజేసేందుకు జనవరి 25నుంచి ఫిబ్రవరి 4వరకు గిరిజన సంస్కృ తిక యాత్ర ను నిర్వహిస్తున్నట్టు వనవాసి కళ్యాణ ఆశ్రమం  యాత్ర ప్రముఖ్ ఉబ్బేటి నాగేశ్వరావు చెప్పారు. విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంతో కలిసి ఆంధ్రప్రదేశ్ వనవాసీ  కళ్యాణ ఆశ్రమం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని శుక్రవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. యాత్ర సహ ప్రముఖ్ వలురౌతు మోహన్ రావు,  వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం ఆంధ్ర ప్రదేశ్ సంఘటన కార్యదర్శి విద్యాధర మహంతో, వనవాసి నగర ప్రముఖ్ అద్దేపల్లి ఈశ్వర్ లతో కలిసి మాట్లాడారు. ఎంతో ఉన్నతమైన గిరిజన జీవన శైలి ,సంస్కృతి  సాటి ప్రపంచానికి ఆదర్శం అని, ఎన్నో అంశాలను గిరిజన నుంచి  సాటి సమాజం నేర్చుకుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గిరిజన సంస్కృతి ద్వారానే తూర్పు కనుమలు సుసంపన్నం అయ్యాయని అన్నారు. గిరిజన సంప్రదాయాలు సంస్కృతి ,కళలు వంటివి అంతరించిపోకుండా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఆ లక్ష్యంతోనే యాత్రను చేపట్టామని వివరించారు.

గిరిజనుల సాంప్రదాయక పరిజ్ఞానాన్ని వెలికితీసి దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గిరిజన ఆచార సంప్రదాయాలు ,సంస్కృతి హక్కులకు కూడా ప్రమాదం పొంచి ఉందని  వీటిని రక్షించాల్సిన అవసరాన్ని ఈ యాత్ర గుర్తు చేస్తున్నదని అన్నారు. జనవరి 25వ తేదీ  సాయంత్రం ఐదు గంటలకు జైపూర్ లో ప్రారంభమయ్యే  ఈ యాత్ర కోరాపుట్ ,పెద్దబయలు, అరకు లోయ,  హుకుంపేట, పాడేరు మినుములూరు, వంట్లమామిడి కోనం, ఎస్.కోట ,విజయనగరం అనందపురం ,సింహాచలం మీదుగా నాలుగో తేదీన విశాఖ చేరుకుంటుందని చెప్పారు. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం మూడు గంటలకు  ఆంధ్రా విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాలులో ముగింపు సభ జరుగుతుందని చెప్పారు. గిరిజనుల మూలికా వైద్యం ,గీతం ,సాహిత్యం ,నాట్యం విలువిద్య , కొండలు ఎక్కటం, చెట్లు ఎక్కడం వంటివాటిని సాటి సమాజానికి నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.  ఒడిస్సా లోని నందపురం, జయపూర్ లను పాలించిన గిరిజన రాజులు ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపనలో, విశాఖ అభివృద్ధిలో కీలకపాత్ర వహించారని ఆ విషయాలను కూడా యాత్ర బహిరంగ పరుస్తుందని చెప్పారు. తూర్పు కనుమల గిరిజనుల వైభవాన్ని, సాహసాన్ని ఈ యాత్ర చాటిచెప్పనుందని అన్నారు.