ఉద్యమానికి ఆయుధం సాహిత్యం.. ఐ.ప్రసాదరావు


K.NagaJyothi
37
Kakinada
2024-01-12 13:55:05

సాహిత్యం ఒక ఉద్యమానికి ఆయుధం వంటిదని జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఐ.ప్రసాదరావు పేర్కొన్నారు. కాకినాడ యూటిఎఫ్ హోం లో ఐక్య ఉపాధ్యాయ పత్రిక తొలి ప్రధాన సంపాదకుడు అమరజీవి మైనేని వెంకటరత్నం వర్థంతి సభ జిల్లా యూటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు అసోసియేట్ అధ్యక్షుడు వివి రమణ అధ్యక్ష వహించారు. ముందుగా మైనేని చిత్ర పటానికి  పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  " ఉద్యమానికి ఆయుధం సాహిత్య అధ్యయనం" అనే అంశంపై ఆయన మాట్లాడారు. సమాజంలో అనేక వివక్షతలపై ప్రధానంగా కుల, లింగ వివక్షతలపై జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, గురజాడ అప్పారావు వంటి వారు తమ రచనల ద్వారా ప్రజలను జాగృతం చేసారన్నారు. ఇక ఆర్థిక అసమానతలపై కారల్ మార్క్స్, శ్రీ శ్రీ అనేక రచనలు చేశారని తెలియజేశారు. నేటి సమాజంలో  ఉన్న జాతి, లింగ, భాషా, కుల వివక్షతలపై అభ్యుదయ భావాలు కలిగిన  వారు అందరూ సాహిత్యం అధ్యయనం చేయాలని, చైతన్యవంతమైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, చక్రవర్తి, వర్మ, పత్రికా బాధ్యుడు గోపాలరావు, సి.హెచ్. వి. రమణ, ప్రముఖ సాహితీవేత్త అద్దేపల్లి ప్రభు తదితరులు పాల్గొన్నారు.