సచివాలయాల్లో కరోనా ఆసుపత్రుల జాబితా..
Ens Balu
5
Srikakulam
2020-09-29 16:26:15
కరోనా ఆసుపత్రుల జాబితా ప్రతి గ్రామ సచివాలయంలో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల జాబితా సైతం సచివాలయంలో ప్రదర్శించాలని స్పష్టం చేశారు. కరోనా పరీక్షలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని ఆయన అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరీక్షలకు, ఆసుపత్రిలో చేరుటకు హెల్ప్ లైన్ నంబరుగా 104 ను బాగా ప్రాచుర్యం కల్పించాలని అన్నారు. కరోనా చికిత్స ఆసుపత్రుల్లో ఆహారం, పారిశుద్ధ్యం, వైద్య పరికరాలు, వైద్యులు, సిబ్బంది పనితీరుపై నివేదికలు తరచూ సమర్పించాలని పేర్కొన్నారు. ఇదే విధానం కోవిడ్ కేర్ కేంద్రాల్లో సైతం ఉండాలని ఆయన స్పష్టం చేసారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ఖచ్చితంగా మెడికల్ కిట్లు పంపిణీ చేయాలని ఆయన అన్నారు. పిహెచ్సీకి మాప్ చేయాలని, వైద్యుల పర్యవేక్షణ విధిగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాధమిక దశలో కేసులను గుర్తించడం వలన మరణాలు తగ్గుముఖం పట్టాయని ఆయన అన్నారు. ఖరీఫ్ పంట సేకరణకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలను సిద్ధం చేయాలని చెప్పారు. ఇ క్రాపింగ్ విధిగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఇ క్రాపింగు ద్వారానే బీమా, పెట్టుబడి సహాయం తదితర సహాయకాలు అందుతాయని అన్నారు. మాన్యుల్ గా ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతుల నమోదు కార్యక్రమం ముందుగా పూర్తి చేసి జాబితా ప్రదర్శించాలని పేర్కొన్నారు. కనీస గిట్టుబాటు ధరలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గిట్టుబాటు ధరలు విధిగా అందాలని పేర్కొన్నారు. ప్రతీ అంశం రైతులకు లాభదాయకంగా ఉండేవిధంగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. బహుళ సౌకర్యాల కల్పనా కేంద్రం ఏర్పాటుకు రైతు భరోసా కేంద్రం ప్రక్కనే ఒక ఎకరా స్థలాన్ని గుర్తించాలని తద్వారా నాణ్యత పరిశీలన, కోల్డ్ స్టోరేజ్ తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో రూ.6300 కోట్లను మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే సంవత్సర కాలంలో ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. పంటల సలహా సంఘాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. సమగ్రమైన రైతు ప్రయోజన ప్రణాళికలు తయారు కావాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఉపాధి హామీ క్రింద గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్ లను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. అంగన్వాడీ, నాడు నేడు, ప్రహారీ గోడలు, సీసీ రోడ్లు, కాలువలు, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు తదితర పనులపై దృష్టి సారించి పూర్తి చేయాలని ఆయన చెప్పారు. గ్రామ ఇంజినీరింగ్ సహాయకుల సేవలు పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు. నవంబరు 2 నుండి పాఠశాలలు ప్రారంభానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అయితే అక్టోబర్ 5వ తేదీన విద్యా కానుకను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. సచివాలయాల నుండి బియ్యం కార్డు, పింఛను కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, ఇంటి స్థలం పంపిణీ సేవలు త్వరగా జరగాలని ఆయన చెప్పారు. అక్టోబర్ 2 వ తేదీన ఆర్ఓఎఫ్ఆర్ క్రింద గిరిజనులకు భూములు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్, జేసిలు డా.కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, సిపిఓ ఎం.మోహన్ రావు, సమగ్ర శిక్షా అభియాన్ ఇఇ వెంకట కృష్ణయ్య, జెడ్పి డిప్యూటీ సిఇఓ ప్రభావతి, మార్కెటింగ్ ఎడి బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.