గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని తెలుగుదేశం పార్టీ యువనాయకులు, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సచివాలయ శాఖ సీఎం వైఎస్.జగన్ రెడ్డి మానస పుత్రిక అని చెబుతూ, ఉద్యోగులను మభ్యపెడుతూ నేటికీ ఈప్రభుత్వశాఖకు చట్టబద్దత తీసుకురాలేదన్నారు. చట్టబద్ధత లేని ప్రభుత్వశాఖ ఉద్యోగులకు రక్షణ ఎక్కడ ఉంటుందో ఉద్యోగులకు సమాధానం చెప్పాలన్నారు. అంతేకాకుండా పీఆర్సీని అమలు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం నేటికి సదరు పీఆర్సీ అరియర్స్ ఇవ్వలే దని, రెండేళ్ల తరువాత సర్వీసును రెగ్యులర్ చేస్తామని చెప్పి అదనంగా 9 నెలలు ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకోలేదా అని ప్రశ్నించారు. సర్వీసు రెగ్యులర్ చేసిన తరువాత ఏపీ సబార్డినేట్ సర్వీసు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్ల విషయంలో నేటికీ ఎలాంటి ప్రకటనే చేయకపోవడం ఉద్యోగులను మోసం చేసినట్టు కాదా అని నిలదీశారు. నేటికీ కొన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు సర్వీసు రూల్స్, ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేయలేదన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా
ఒకేసారి 1.25లక్షలు ఉద్యోగాలు భర్తీచేశామని తెగ ప్రచారం చేసుకునే ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు కల్పించిన ప్రయోజనాలను సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఎందుకు అమలు చేయలేదో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీకే ఓట్లు వేయించుకునే విధంగా ఆఖరి క్యాబినెట్ సమావేశం వరకూ గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత కల్పించే అంశంపై ప్రభుత్వం ప్రకటన చేయలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సచివాలయ శాఖకు ఈ క్యాబినెట్ లో చట్టబద్దత కల్పించడంతోపాటు, ఉద్యోగులకు గత పీఆర్సీ లో ఇవ్వాల్సిన అరియర్స్..9నెలల కాలానికి 2 డిఏలు, సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లను వెంటనే విడుదల చేయాలని ఆడారి కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగులను మోసం చేసిన తీరును రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు తెలియజేసి వారిని చైతన్య పరిచి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.