అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీని ముస్లిమేతరులుగా ప్రకటించేందుకు ప్రయత్నించడం భారత రాజ్యాంగానికి విరుద్ధమని సంస్థ జాతీయ ప్రతినిధి కె.తారీఖ్ అహ్మద్ పేర్కొన్నారు. విశాఖ నగరంలో అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ ప్రపంచ శాంతిపై జనవరి 28న గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించాల్సి ఉందని కానీ. కానీ కొన్ని ముస్లిం సంస్థలు ఈ సదస్సును అడ్డుకోవాలని పిలుపునివ్వడం దారుణమన్నారు. ఈ అన్యాయపు ప్రయత్నాన్ని ఆహ్మదియ్య ముస్లిం సంఘం తీవ్రంగా ఖండిస్తూ, తమకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు విశాఖలో మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విశాఖపట్నం శాఖ అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీని ముస్లిమేతరులుగా ప్రకటించే ప్రయత్నాన్ని బలపర్చడం రాజ్యాంగ ఉల్లంఘన చర్యగా అభివర్ణించారు. అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ మనసా వాచా “లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్” కలిమాను విశ్వసిస్తూ, ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి (స.అ.స) ఆయన దైవ సందేశహరుడు, ఖాతమున్నబియ్యీన్ అని, పవిత్ర ఖురాన్ అల్లాహ్ యొక్క అంతిమ దైవ గ్రంథం అని విశ్వసిస్తుందన్నారు.
అహ్మదీయ ముస్లింలు ఇస్లాం యొక్క మూల సూత్రాలు,విశ్వాసాలపై మనస్పూర్తిగా నడుచుకుంటారని తెలియజేశారు. భారతదేశంలోని అనేక హైకోర్టులు అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ ఒక ఇస్లామిక్ సంస్థ అని తీర్పులనిచ్చాయనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదేవిధంగా 2011 జనాభ లెక్కల రిపోర్ట్ అధికారికంగా అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీని ఇస్లాంలో ఒక శాఖగా గుర్తించిందని తెలియజేశారు. ప్రపంచంలో అశాంతి, ఆందోళనలు, 3వ ప్రపంచ యుద్ధం అనివార్యంగా కనిపిస్తున్న తరుణంలో అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ ప్రపంచవ్యాప్త నాయకుడు ప్రస్తుత ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ ఆధ్యాత్మిక నాయకత్వంలో విశ్వవ్యాప్తంగా శాంతి సదస్సు లు నిర్వహిస్తోందన్నారు.
శాంతి స్థాపన కోసం జరిగే ప్రయత్నాలను అడ్డుకోవాలని కొన్ని ముస్లిం సంస్థలు చూడడం దురదృష్టకరమని, ఖండనీయమని పేర్కొన్నారు. భారతదేశం వంటి లౌకిక దేశంలో మతపరమైన ఫత్వాలు చట్టాలు కాజాలవని గుర్తుంచుకోవాలన్నారు. ఈ ఫత్వాలకు ఇస్లాం నిజమైన బోధనలకు ఎలాంటి సంబంధం లేదని, ఇటువంటి శాంతి సదస్సులు వివిధ వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించి, సమాజంలో శాంతిని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇటువంటి కార్యక్రమాలను అన్ని వర్గా ముస్లి సంఘాలు ప్రోత్సహించి, మద్దతు ఇవ్వాలని కోరారు. ఇస్లాం అంటేనే ‘శాంతి, భద్రతలు’ అని అర్థమని.. శాంతిని పెంపొందించే ప్రయత్నాల్లో అడ్డంకులు సృష్టించడం, ఇస్లాం సిద్ధాంతాలకు, బోధనలకు విరుద్ధమన్నారు. అన్ని ముస్లిం సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సామాజిక శాంతి, మత సామరస్యానికి హాని కలిగించే ప్రకటనలు జారీ చెయ్యకూడదనీ విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు.