ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలతో సిద్ధం..జిల్లాకలెక్టర్


Ens Balu
23
Anakapalle
2024-02-16 13:56:40

రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలను చేపట్టడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ జిల్లా ఎస్పీ కెవి మురళీకృష్ణ తో కలసి  పాల్గొన్నారు.  జిల్లాలో జరగనున్న పార్లమెంటు, అసెం బ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను ఆయన వివరించారు.  జిల్లాలో గల పోలింగ్ కేంద్రాలను అన్ని మౌలిక వసతులతో సిద్ధం చేయడం జరిగిందని, నిర్వహణకు అవసరమైన అధికారులు సిబ్బందిని సమాయత్తం చేయడం జరిగిందని చెప్పారు. రూటు మ్యాపులను సిద్ధం చేసినట్లు, అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో సమస్యాత్మక అతి సమస్యాత్మ కేంద్రాలను గుర్తించామని వాటి దగ్గర అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గత ఎన్నికలలో జరిగిన సంఘటనలు పరిశీలించి తదనుగుణంగా ప్రణాళికాయుక్తంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

మద్యం ఇతర మాదక ద్రవ్యాల రవాణాను ముందుగానే గుర్తించేందుకు అవసరమైనచోట్ల చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా తగిన కమ్యూనికేషన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు సిబ్బంది పోలీసు సిబ్బంది వాహనాలు గస్తీ సిబ్బంది మొదలైన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈవీఎంలపై ఓటింగ్ ఏ విధంగా చేయాలనే శిక్షణా కార్యక్రమాలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. వివాదాలు జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించడం జరిగిందన్నారు. పోలీస్ రెవెన్యూ ఇతర సిబ్బందితో ప్రశాంత వాతావరణంలో ఓటర్లందరూ నిర్భయంగా ఓటింగులో పాల్గొనే విధంగా తగిన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్, సిపిఓ జి రామారావు, నర్సీపట్నం ఆర్డిఓ హెచ్.పీ జయరాం, నర్సీపట్నం పాయకరావుపేట ఎలమంచిలి అనకాపల్లి చోడవరం మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు, తాసిల్దార్లు ఎన్నికల విభాగం పర్యవేక్షకులు డి.రామ్మూర్తి, డిటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.