ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్దం కావాలి..
Ens Balu
3
కలెక్టరేట్
2020-09-29 18:58:51
ఖరీఫ్ లో పండించే ధాన్యం కొనుగోలుకు సిద్దంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 2020-21కు సంబంధించి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంట పండించే గ్రామాల జాబితా సిద్దం చేయాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులను ఆదేశించారు. రైతులు తాము పండించే పంటను విక్రయించేందుకు తమ పేర్లను ఆన్ లైన్ లో నమోదు చేసుకుంటే ఏ ఏ తేదీలలో ధాన్యం కొనుగోలుకు వస్తారో తెలియజేస్తారన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి విధి విధానాలపై అధికారులతో చర్చించారు. రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. వెలుగు సిబ్బంది, పిఎసిఎస్ గ్రూపులు వెళ్లి నాణ్యత, రికార్డ్స్, ప్రతీ రోజు రిపోర్టులు అందజేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో టంటం వేయించాలని, గ్రామాలు, రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి బేనర్లు పెట్టాలని, పాంప్లేట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. నవంబరు 15వ తేదీ నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, ధాన్యం కొనుగోలు చేయనున్న సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ తయారు చేయాలని చెప్పారు. రైస్ మిల్లులు సిద్దంగా ఉంచాలని డిఎస్ఓ రూరల్ శివ ప్రసాద్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ డి.ఎం. పి. వెంకటరావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు లీలావతి, గ్రామీణ పౌర సరఫరాల అధికారి శివప్రసాద్, వ్యవసాయ శాఖ ఎడి కాళేశ్వరరావు, రవాణా శాఖ అధికారులు, డిఆర్డిఎ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.