ఆ నేతలందరికీ రాజకీయ సమాధి..!


Ens Balu
83
vizag
2024-03-31 20:44:20

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. రాజకీయపార్టీలు ప్రజా సేవ కంటే..అధికారం కోసం ఏమైనా చేయడానికి..ఎలాంటి పనులనైనా చేపట్టడానికి సిద్దపడి పోతున్నాయి. జెండాలు మోసి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ పార్టీని పటిష్టం చేసిన వారిని కాకుండా లాభీయింగ్ చేసే వారికి ప్రధాన్యత ఇస్తున్నాయి. గెలిస్తే పదవులు ఇవ్వాల్సి వస్తుందని ఎమ్మెల్యే నుంచి ఎంపీ స్థానానికి, మంత్రిగా అవకాశం కావాలనుకునే వారికి కాస్త డబ్బు దండిగా ఖర్చుపెట్టేవారికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎన్నికల రంగంలోకి తించుతున్నాయి రాజకీయ పార్టీలు. ఉత్తరాంధ్రాలో ఒక ఎంపీ తాను మంత్రిని కావాలనుకుంటున్నానని.. దానికి తానేం ఇవ్వాలో చెబితే.. దానికి రెట్టింపు ఇవ్వడానికి సిద్ధమని ఒప్పుకోవడంతో ఆయనను ఎంపీ నుంచి పిలిచి మరీ ఎమ్మెల్యేగా పోటీచేయిస్తున్నాయని.. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీ లు నాలుగు కాలాలపాటు నిలబడాలన్నా..అధికారం చేజిక్కుంచుకోవాలన్నా..  స్థానిక సీయర్ నాయకుల రాజకీయ భవిష్యత్తుని సమాధి చేసి.. స్థానికేతర బడా నాయకులకు రాజకీయ ఉపాది చూపిస్తే తప్పా పరిస్థితి తమకి అనుకూలంగా మార్చుకునే పరిస్థితిలేదనే పరిస్థితికి వచ్చేశాయి.  ఇక వామ పక్షపార్టీలు తీరు ఆది నుంచి ఒకేలా కనిపస్తున్నా.. ఇపుడు సదరు పార్టీలోని నేతలు కూడా రిజర్వేషన్లు ఆధారంగా కమర్షియల్ పొలిటికల్ పార్టీల్లోకి జంపింగ్ లు చేస్తున్నారు. గతంలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచే వారికి, ప్రజల మద్దతు ఉన్నవారికి, సామాజిక బలం ఉన్నవారికి, ఆపై కాస్తో కూస్తో ఆర్ధిక బలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చేవి. ఆ పరిస్థితి ఇపుడు పూర్తిగా మారిపోయింది. ఆర్ధికంగా బలంగా ఉంటే రాష్ట్రంలో ఏమూలనైనా, ఏ నియోజకవర్గంలోనైనా నిలబెట్టి గెలిపించేయొచ్చుననే లెక్కకు వచ్చేశాయి రాజకీయపార్టీలు. దీనితో పార్టీనే నమ్ముకున్న స్థానిక నేతలకు చిప్పచేతికి వచ్చేస్తున్నది. జిల్లాలో పుట్టి పెరిగి.. రాజకీ యపార్టీలకు ఊడిగం చేసేసరికే వారి బ్రతుకులు తెల్లారి పోతున్నాయి. ఈ క్రమంలో పార్టీలనే నమ్ముకున్న చాలా మంది నేతలకు రాజకీయ భవిష్యత్తుకి సమాధులు సిద్ధమైపోతున్నాయి. 

తాజాగా ఉత్తరాంధ్రాలో ఈ పరిస్థితి అన్ని రాజకీయ పార్టీల్లోనూ కనిస్తున్నది. పార్టీలు అధికారంలోకి రావడం కోసం సామాజిక వర్గాల్లోని నెట్వర్క్ ఉన్న యువతను, వాక్ చాతుర్యం ఉన్న యువతను పావులుగా వాడుకొని వారికి మొండి చేయి చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో సుమారు 100 స్థానాల్లో ప్రస్తుతం ఉన్న పార్టీలు తమ అభ్యర్ధులను పూర్తిగా మార్చేసి..ఇప్పటి వరకూ పనిచేసిన వారికి పార్టీని నమ్ముకున్న వారికి పక్కన పెట్టేశాయంటే అధికార దాహం ఏ స్థాయిలో ఉండి జెండా మోసిన వారికి దండవేసేశారో అర్ధం చేసుకోవచ్చు. పైగా అలా దగాపడ్డ నేతలందరికీ సదరు రాజకీయపార్టీలు చెప్పే కాకమ్మ కథలేంటంటే.. మీకు సామాజిక బలం లేదు..? ఆర్ధిక బలం లేదు..? మీ పై ఇంటెలి జెన్స్ రిపోర్టులు వ్యతిరేకంగా ఉన్నాయి..? మీకు స్థానిక బలం అంతకంటే లేదు.. మీరు ఈసారికి పక్కనుండండి.. పార్ఠీ గెలిచిన తరువాత ఏదో ఒక నామినెటెడ్ పోస్టు ఇస్తాం..లేదంటే మీ ఇష్టమని తెగేసి చెబుతున్నాయి. కాస్త వాయిస్ ఉన్న నేతలు ఉండాలనుకుంటే పార్టీలో ఉంటున్నారు.. లేదంటే పక్కపార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. అలా జంప్ అయిపోయిన వారికి కూడా పక్కపార్టీలు పిలిచి మరీ సీట్లు ఇవ్వడంతో అప్పటి వరకూ తాను ఎమ్మెల్యే, ఎంపీ రేసులో ఉంటానని పార్టీ కార్యక్రమాల లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన నేతలంతా తమ డబ్బంతా పార్టీ కార్యాలయాలకు సున్నానికి వాడినట్టు అయిపోయిందనే బావనకు వచ్చేస్తున్నారు. రాజకీయమంటే మరీ ఇంత దారుణంగా ఉంటుందా..? అధికారం కోసం, పదవుల కోసం పార్టీని నమ్ముకున్న సీనియర్లను ఎంతకైనా మడత పెట్టేస్తారా..? అని ఓ ప్రధాన పార్టీ నేత మీడియా ముందు వ్యాఖ్యానించారంటే ప్రస్తుత రాజకీయ పార్టీల అధికార పందేరం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా కనిపిస్తున్నది.

ఇపుడున్న రాజకీయ వ్యూహంలో ఎంపీ స్థానానికి వంద నుంచి 200 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని..ఎమ్మెల్యేకి 100 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని..ఆ స్థాయి ఉంటేనే ఎన్నికల్లో నిలబడటానికి ముందు రావాలనే సంకేతం పార్టీలే స్వయంగా ఇచ్చేయడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వానికి సమర్పించే అఫడివిట్ లలో చూపించే ఖర్చులకు, ఎన్నికల బరిలో నిలబడి అభ్యర్ధులు చేసే ఖర్చులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీనితో రాజకీయ ఉపాది జీవితాంతం కావాలనుకుంటే పక్కనేతకు సమాధి కట్టడానికి మనం కూడా ఇసుక మోయాలి, ఇటుక పేర్చాలన్నట్టుగా మారిపోయిందని నేతలు బుర్రలు పీక్కుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికలకి బీ-ఫాం ఇచ్చే వరకూ ఏ రాజకీయ పార్టీలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్ధి, ఎవరు ఎంపీ అభ్యర్ధి, ఎవరు ఎమ్మెల్సీ అభ్యర్ధో తెలియని పరిస్థితి నెలకొంది. కులాల మధ్య చిచ్చుపెట్టి మా పార్టీ పేదల పార్టీ అని చెప్పుకుంటూనే ఎందరో నాయకుల రాజకీయ భవిష్యత్తులతో ఆట్లాడుకునే పార్టీల వ్యవహారాన్ని ఓటరు చాలా నిశితంగా పరిశీలిస్తున్నాడనే విషయం ఇప్పుడిప్పుడే పార్టీలకు అర్ధం అవుతున్నా.. కమర్షియల్ పొలిటికల్ బిజినెస్ లో అవేమీ పరిగణలోకి రావడం లేదు. గతంలో జరిగిన ఎన్నికలు, 2024లో జరిగే ఎన్నికలకు చాలా తేడాలున్నాయని.. ఈసారి ఏ నేత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుంది..? ఏ సీనియర్ నేత రాజకీయ భవిష్యత్తు ఈ ఎన్నికలతో సమాధి కాబోతుందో త్వరలోనే తేలిపోనున్నది. మరే నేతకు రాజకీయ ఉపాది మరో ఐదేళ్లకు కుదురుతుందో లెక్కలు గడుతున్నాయి పార్టీలు. నిజమైన ఓటరు..తెలివైన ఓటరు ఈ రాజకీయపార్టీల చేసే వ్యాపారాన్ని పూర్తిస్థాయిలో అర్ధం చేసుకుంటే నిజం ప్రజల కోసం పనిచేసే నేతలను చట్టసభలకు పంపిస్థాడు. అది జరుగుతుందా..? లేదటే మళ్లీ యదా రాజా తదా ప్రజా అన్నట్టుగా రాజకీయపార్టీలే ఓటరుని నోటు దగ్గరకి తీసుకొచ్చి అధికారం కోసం ఏమైనా చేస్తాయా అనేది వేచి చూడాలి..!