ఏప్రిల్ 15 నుంచి 61 రోజులు చేపలవేట నిషేధం.. ఫిషరీష్ డిడి ఎన్.నిర్మలకుమారి


Ens Balu
109
vizianagaram
2024-04-06 14:48:51

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాలలో చేపలవేటను ఈనెల 15 నుంచి 61 రోజుల పాటు నిషేధిస్తున్నట్టు ప్రభుత్వ ఉత్వర్వులు జారీచేసిందని మత్స్యశాఖ ఉపసం చాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చేపల వేటకు వినియోగించే యాంత్రిక పడవలు, మోటారు బోట్లు ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపలు వేటను ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ నిషేధిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం(జి.ఓ ఆర్ టి సంఖ్య 81, పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్ మరియు మత్స్య శాఖ తేది: 15.03.2024) జారీ చేసిందన్నారు. సముద్ర జలాలలో చేపల వేట నిషేధించడానికి గల కారణాలు వివిధ చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కాలములో తల్లి చేపలు,  రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడము, తద్వారా సముద్ర మత్స్య సంపద సుస్థిరతను సాధించడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వం నిషేదించిన ఉత్తర్వులను అనుసరించి మత్స్యకారులు సముద్ర జలాలలో యాంత్రిక పడవలు పై మత్స్యకారులు ఎటువంటి చేపలవేట చేయకుండా మత్స్య అభివృ ద్ధికి సహకరించాలని కోరారు.

అంతేకాకుండా నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఆయా బోట్లు యజమా నులను ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టము ఏపిఎంఎఫ్ఆర్ యాక్టు 1994, సెక్షన్ (4) ను అనుసరించి చర్యలు తీసుకోవడంతోపాటు, జరిమానా, బోట్లు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని.. వారి బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీన పరుచుకోవడంతోపాటు, జరిమానా విధిస్తూ, డీజిల్ ఆయిల్ రాయితీ, ప్రభుత్వం అందించే అన్నీ రకముల రాయితీ సౌకర్యాలను నిలుపుదల చేస్తారని హెచ్చరించారు.  అంతేకాకుండా ఈ నిషేద కాలములో ఖచ్చితముగా ప్రభుత్వ ఉత్తర్వులు  అమలు చేయుటకై మత్స్య శాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేశారని..కావున మత్స్యకారులు అందరూ సహకరించవలసినదిగా  మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి కోరారు.