అక్టోబర్ 26, 27న పైడితల్లి అమ్మవారి ఉత్సవం..
Ens Balu
2
కలెక్టరేట్
2020-09-29 19:09:38
అక్టోబరు 26,27న జరిగే పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూనే, సంప్రదాయాలకు అనుగుణంగా పండుగను నిర్వహించాలని సూచించారు. పైడిమాంబ ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి ఉత్సవానికి ఈ సారి విభిన్నంగా, వినూత్నంగా నిర్వహించాలన్నారు. ఆలయ నిబంధనలను, సంప్రదాయాలను పాటిస్తూనే, ఉత్సవంలో కొత్తదనం కనిపించేలా చూడాలన్నారు. దానికి తగ్గట్టుగా విద్యుత్ దీపాలంకరణ, వివిధ కూడళ్లను తీర్చిదిద్దడం, రోడ్ల విస్తరణ, ఏర్పాట్లు ఉండాలన్నారు. అలాగే గత రెండేళ్లుగా విజయనగరం పట్టణంలో జరిగిన అభివృద్ది, నాటికీ, నేటికీ వచ్చిన మార్పు కనిపించాలన్నారు. పట్టణ పరిధిలోని చారిత్రక, ప్రభుత్వ కట్టడాలతోపాటు, ప్రతీ దేవాలయాన్ని, షాపింగ్ మాల్స్, హొటల్స్‌ను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. భక్తులు దర్శనానికి ఎక్కడా ఇబ్బంది పడకుండా క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. పైడితల్లి అమ్మవారి జాతర రాష్ట్రప్రభుత్వ ఉత్సవమని, ఆ స్థాయికి తగ్గ ఏర్పాట్లు చేయాలని, ఏర్పాట్లన్నీ విజయదశమి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
సంప్రదాయానుసారం అమ్మవారి ఉత్సవ నిర్వహణ ఎంత ముఖ్యమో, భక్తుల ఆరోగ్యం, భద్రత కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. మాస్కులను ధరించినవారిని మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. క్యూలైన్లలో, ఉత్సవంలో భక్తులు తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలన్నారు. అలాగే వచ్చే భక్తులకు శానిటైజర్‌ను వేయాలని సూచించారు. మాస్కుల పంపిణీకి స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయి ఉత్సవం కాబట్టి, అమ్మవారి పండుగకు ఇతర జిల్లాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఎక్కడా తోపులాటలు, రద్దీలకు తావివ్వకుండా బారికేడింగ్‌ను పకడ్ఢంధీగా చేయాలన్నారు. ప్రతీ భక్తుడూ సంతృప్తిగా అమ్మవారిని, సిరిమాను ఉత్సవాన్ని దర్శించుకొనే విధంగా ఏర్పాట్లు చేయడమే మనందరి లక్ష్యం కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలు చేయాల్సిన పనులను, ఏర్పాట్లను వివరించారు. ఉత్సవ నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా, వివిధ శాఖల అధికారులంతా సమన్వంతో, సమిష్టిగా పనిచేయాలని కోరారు. సిరిమానును తరలించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, 27వ తేదీ సిరిమానోత్సవం రోజున ఉదయం 11 గంటలకల్లా ఆలయం వద్దకు సిరిమానును తీసుకువచ్చేవిధంగా చూడాలని సూచించారు. అలాగే సిరిమానోత్సవం సాయంత్రం 5 గంటలకు ముగిసిలే చూడాలన్నారు. నవంబరు 3వ తేదీన నిర్వహించే తెప్పోత్సవానికి తగిన ఏర్పాట్లు చేయాలని మత్స్యశాఖాధికారులను ఆదేశించారు. నవంబరు 10వ తేదీ ఉయ్యాల కంబాలతో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయని, అప్పటివరకూ ప్రతీఒక్కరూ తమకు అప్పగించిన విధులను తూచా తప్పకుండా, చిత్తశుద్దితో నిర్వహించాలని వెంకటరావు కోరారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జివిఎస్ఎస్ఆర్ సుబ్రమణ్యం, ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు, విజయనగరం డిఎస్‌పి ఎల్.మోహనరావు, మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలకుమారి, జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఎడి డి.రమేష్, డిఇ ఎస్‌వి రమణ, వివిధ శాఖల ప్రతినిధులు, అధికారులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.