అక్టోబరు 1 నుంచి కుష్టు వ్యాధగ్రస్తుల గుర్తింపు..
Ens Balu
2
Vizianagaram
2020-09-29 19:13:52
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం(నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రాం)లో భాగంగా జిల్లాలో కుష్టువ్యాధి గ్రస్తుల గుర్తింపు కార్యక్రమాన్ని అక్టోబరు 1 నుండి 14 వరకు చేపట్టనున్నట్టు జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏ.ఎన్.ఎం., ఆశ లేదా వలంటీర్ తదితర ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలు వున్న వారిని గుర్తిస్తారని చెప్పారు. రెండేళ్ల వయసు కంటే మించిన వారిలో చర్మంపై స్పర్శలేని మచ్చలు ఎవరికైనా వుంటే వాటిని కుష్టువ్యాధి లక్షణాలుగా భావించి తమ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లి తనిఖీ చేయించుకొని ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకుంటే వ్యాధి సోకకుండా నిరోధించవచ్చన్నారు. జిల్లాలోని 19 మండలాలను కుష్టువ్యాధి అధికంగా వున్న మండలాలుగా గుర్తించామని, ఈ మండలాల్లో ఒకటిన్నర సంవత్సరాల పాటు ప్రతినెలా 16 నుండి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఏక్టివ్ కేసుల గుర్తింపు కార్యక్రమాన్ని కూడా చేపడతామన్నారు. వ్యాధి ప్రభావం తక్కువగా వున్న మిగిలిన 14 మండలాల్లో ఒక ఏడాదిపాటు ఏక్టివ్ కేసులగుర్తింపు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కుష్టువ్యాధి గ్రస్తుల గుర్తింపు కార్యక్రమం(లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్)పై చర్చించే నిమిత్తం జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఈ కార్యక్రమానికి సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణకుమారి, జిల్లా లెప్రసీ అధికారి డా.రవికుమార్, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు డైరక్టర్ రాజేశ్వరి, ఆశ జిల్లా సమన్వయ కర్త బి.మహాలక్ష్మి, మునిసిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, మెప్మా పి.డి. సుగుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.