బొత్స సత్యన్నారాయణ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడిగా పేరుగాంచిన రాజకీయ చతురత కలిగిన నాయకుడు. ఇపుడు ఆ సీనియారిటీని.. వ్యూహాత్మకతను.. అజమాయిషినీ.. ఆర్ధిక బలాన్ని..బుద్ధి బలాన్ని.. సామాజిక బలగాన్ని.. కుటిల ఎత్తుగడ లను.. రాజకీయచట్రంలో వేసి కూటమి ని ఢీకొనే సమయం ఆశన్నమైంది. సామాజిక పరంగా బలమైన నేత కావడం, ఉత్తరంధ్రా అందున విశాఖ జిల్లాపై పట్టు ఉండటంతో ఇపుడు బొత్సను వైఎస్సార్సీపీ అధిష్టానం స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలబెట్టింది. తద్వారా శాసన మండ లిలో వాయిస్ పెంచేందుకు వీలుగా వుంటుందని భావిస్తోంది. ఇపుడు కూటమి నేతలు కూడా వైఎస్సార్సీపీ ఎన్నికల బరిలోనే మట్టి కరిపిం చేందుకు వారి ఎత్తుగడలు వారూ వేస్తున్నారు. రసకందాయ రాజకీయ ముఖచిత్రంలో ఇపుడు కూటమి అభ్యర్ధిని ఎదుర్కొని.. అధికారపార్టీని కాదని గెలిస్తేనే బొత్స రాజకీయంగా బలవంతుడనే పేరు నిజమవుతుంది. లేదంటే ఆ రోజులు పోనాయ్.. ఇపుడు ఎవరికి అధికారం ఉంటే వారిదే రాజ్యం.. మరేటి సేత్తాం.. అధికారం అన్నట్టుగా తేలిపోతుంది.
విద్యార్ధి నాయకుడి స్థాయి నుంచి దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో రెండవ అతి పెద్ద నేతగా ఓ వెలుగు వెలిగిన బొత్స సత్యన్నారాయణకు పార్టీని.. పార్టీలోని క్యాడర్ ను మాటలతో అదిరించి.. బెదిరించే కమాండ్ చేయగల నేతగా పేరుంది. ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వైఎస్సార్సీపీకే ఉన్నప్పటికీ కూటమి అత్యధిక స్థానాలతో ఇటీవలే ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంది. సాధా ర ణంగానే అధికార పార్టీ అంటే భయం, భక్తి..రాజకీయం ఉంటాయి. ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తరువాత వెంటనే వచ్చిన స్థానిక ఎన్నికల్లో ఎవరి బలం ఎంతో ప్రదర్శించుకునే సమయం వచ్చింది. విశాఖజిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం మాత్రం బొత్సనే వరించింది. ఇక్కడ లెక్క దేనికైనా బొత్స సమర్ధుడని అధిష్టానం గుర్తించడం.. అంతస్థాయిలో మరే ఇతర నాయకుడూ క్యాడర్ ను కమాండ్ చేయలేరనే రెండవ మాట కూడొ బొత్సకు కలిసొస్చింది. అధికారపార్టీవైపు ప్రస్తుతం స్థానిక సంస్థల ఓటర్లు మొగ్గు చూపినా వారిని పూర్తిస్థాయిలో రాజకీయంగా.. సామాజిక పరంగా కూటమిలో ఉన్నవారినైనా తన వైపు తిప్పుకునే అవకాశం. చతురత.. వ్యూహాలను పసిగట్టి ప్రతివ్యూహం చేయగల నేర్పు బొత్సలో ఉంది. ఇంత ఉన్నా.. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయాయనే వాదన చాలా మంది ఓటర్లలో బలంగా నాటుకుపోయింది.. అదే సమయంలో పార్టీలో ఉండగా పలుకుబడి సంపాదించామనే భక్తి మరికొందరిలో వుంది.
కనీసం పార్టీ దారుణంగా ఓడిపోయింది కనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా తమ పార్టీ నేతను గెలిపించుకోవాలనే తపన క్యాడర్లోనూ, స్థానిక సంస్థల ఓటర్లలోనూ ఉన్నట్టుగా కినిపిస్తోంది. దానిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనే లక్ష్యంతో బరిలో నిలుచున్న బొత్సకు సరిసమా నాంగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ను పార్టీ దాదాపు ఖరారు చేసేసింది. ఆర్ధికంగా వీరిద్దరూ బల ప్రదర్శన చేసుకోగలరని ఇటు కూటమి కూడా బలంగా నమ్మింది. ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థల ఓట్లలో 80శాతం వైఎస్సార్సీపీకి అనుకుంగానే ఉన్నాయి. అయినా కూటమి అభ్యర్ధిని బరిలో నిలబెట్టి క్యాంపు రాజకీయాల ద్వారా సీటు గెలుపించుకోవడానికి వ్యూహం పన్నిన విషయాన్ని ముందుగానే పసినగట్టిన వైఎస్సార్సీపీ నాయకత్వం సీనియర్ నాయకులు అందర్నీ రంగంలోకి దించింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉత్తరాంధ్ర ఇన్చార్జులు అందరూ ఇపుడు విశాఖలోనే మకాం పెట్టారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్ పరిధిలో కొందరు వైఎస్సార్సీపీ కార్పోరేటర్లు కూటమి పార్టీల్లోకి జంప్ అయిపోయినా.. ఇంకా ఓటు బ్యాంకు బలంగా ఉందనే నమ్మకంతో వైఎస్సార్సీపీ బొత్సాను బరిలో దింపింది.
అనుకున్నదే తడవుగా అటు కూటమి, ఇటు వైఎస్సార్సీపీ ఇరు పార్టీలు పోటీ పోటీగా క్యాంపు రాజకీయాలకు ఎమ్మెల్యే, మంత్రుల ఇళ్లే ప్రధాన స్థావరాలు చేసుకొని వ్యూహాలు రచిస్తున్నారు. గాజువాకలో పీలా శ్రీనివాస్ ఇంట్లో కూటమి కలిస్తే.. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఇంట్లో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఇదే సమయంలో గతంలో ఇదే ఎమ్మెల్సీ స్థానానికి ప్రాతినిధ్యవం వహించి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్సీని వదిలేసి విశాఖ దక్షిణ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ కూడా కూటమి అభ్యర్ధి గెలుపుకోసం కీలకంగా చక్రం తిప్పుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈయన ఉండేది విశాఖలోనే అయినా రూరల్ ప్రాంతంలో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. దానికి తోడు జనసేనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదారణ కూడా ఈయన వ్యూహాలకు బలం చేకూరుతున్నదని తెలిసింది. ఓటు బలం కన్నా ఆర్ధిక బలం గట్టిగా వుంటుందనేది జగమెరిగిన సత్యం. ఆర్ధిక బల ప్రయోగం చేస్తే మాత్రం నువ్వా నేనా అనేది ఖచ్చితంగా తేలిపోతుంది. అలా కాకుండా అధికారాన్ని ప్రయోగిస్తే.. మళ్లీ ఆ లెక్క వేరే లెవల్ లో వుంటుంది. ఇపుడు ఆ రెండూ తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
-కౌన్ బనేగా లక్షాధికారిగా స్థానిక సంస్థల ఓటరు..ఇంతకీ వారెవరు..?!
అధికార కూటమి ప్రభుత్వం.. ఘోరంగా ఓడిపోయిన వైఎస్సార్సీపీలు ఇపుడు ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీటు దక్కించుకోవడానికి ఆర్ధిక బలప్రదర్శనకు దిగుతాయనే వాదన బలంగా వినిపిస్తుంది. దానికోసం ఒక్కో ఓటరుకు సుమారు రూ.5 నుంచి పది లక్షలు వరకూ బేరం పెట్టి ఓటు బ్యాంకు పెంచుకోవాలని యోచిస్తున్నట్టుగా క్యాంపు రాజకీయాల సందుల్లో నుంచి ముఖ్యసమాచారం ఒకటి బయటకు వచ్చి చక్కర్లుకొడుతోంది. అధికారంలో ఉండగా స్థానిక సంస్థల్లోని వారికి ఏమీ చేయలేకపోయాం.. కనీసం ఇపుడైనా వారిని ఆర్ధికంగా ఆదుకుంటే వారికి చేయూతతోపాటు.. పార్టీ సీటు కూడా దక్కి శాసన మండలిలో బలమైన వాణి వినిపించేందుకు వీలుంటుందని వైఎస్సార్సీపీ భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. అంత మొత్తం ఖర్చుచేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో బొత్సాలాంటి బలమైన, ఆర్ధిక అండున్న వ్యాపారవేత్త అయితే సాధ్యమవుతుందని తెలిసే ఈయనను బరిలోకి దించారని సమాచారం అందుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే.. అదే స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వం ద్వారా ఒక్కో ఓటరు స్థాయిలో సుమారు రూ.50లక్షలు నిధులు వారి ప్రాంత అభివృద్ధికి విడుదల చేసి ఓటర్లను చేజారి పోనీయకుండా చేయాలనేది కూటమి వ్యూహంగా కనిపిస్తున్నది. తద్వారా నేతలకు స్థానికంగా పేరు ప్రఖ్యాతలతోపాటు అభివృద్ధి కూడా కనిపించి వారి రాజకీయ జీవితానికి బాటలు వేసినట్టుగా వుందని కూడా కూటమి నేతలు ఆలోచిస్తున్నారని కడపటి వార్తల సమాచారంగా బయటకు వస్తున్నది.
అంతేకాకుండా పార్టీ మారడం ద్వారా ఓటర్లకు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక సంస్థల్లో పలుకుబడి పెంచడం ద్వారా వారికి ప్రజల నుంచి కూడా మంచి మద్దతు తీసుకు రావాలనేది రెండవ ఆలోచనగా వుంది. ఇపుడు రెండు వైపుల నుంచి ఓటర్లకు భారీగానే ప్రతిఫలం దక్కేలా కనిపిస్తున్నా.. ఇది పక్కా ఓట్ల లెక్క. ప్రతిఫలం పొందిన తరువాత ఎక్కడ ఏం జరిగినా..తేడాలొచ్చేస్తాయనే భయం కూడా ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. ఈ తరుణంలో రెండు వైపుల నుంచి వస్తున్న ప్రతిపాదనలలో ఏది మంచిదో తేల్చుకోలేని స్థితిలో ఓటర్లు డైలమాలో పడిపోయారట. అయితే ఇక్కడ సామాజిక పరంగా కూడా ఓట్లు వైఎస్సార్సీపీకే అధికంగా ఉంటడం కూడా బొత్సాకి కలిసి వచ్చే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. అటు స్పీకర్ అయ్యన్న, మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు పీలా శ్రీనివాస్, బండారు సత్యన్నారాయణ, కొణతాల రామక్రిష్ణ, దాడి వీరభధ్రరావు, కెఎస్ఎన్.రాజు లు వారి వారి నియోజకవర్గ కేంద్రాల పరిధిలో ఇప్పటికే ఓటర్లను రౌండప్ చేసేశారట. అదే స్థాయిలో బూడి ముత్యాల నాయుడు, కన్నబాబురాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్, కరణం ధర్మశ్రీ, వారి పరిధిలోని ఓటర్లను బయటకు పోనీయకుండా 15 నియోజకవర్గా లపరిధిలో వారి నెట్వర్క్ ను బలంగానే ఒడ్డుతున్నారన్నది తాజా సమాచారం.
ఎవరి బలం ఎలా ఉన్నా.. ఆర్ధిక బలగం చెప్పే చిలక జోష్యంపైనే మెజార్టీ ఆధారపడి వుంటుందనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. దానికోసం ఏం చేయాలి...? ఎలా చేయాల..? ఎవరిని ఎప్పుడు ఎక్కడ వినియోగించాలనే అంశంలోనూ నేతలంతా బిజీగా ఉన్నారు. అన్ని విధాలుగా బలం, బలగం ఉన్న బొత్సాను ఢీకొట్టి గెలవాలంటే కూటమికి కాస్త కత్తిమీద సామే. ఎందుకంటే చాలా వ్యాపారాల్లో చాలా మంది నాయకులు బొత్సతో సత్సంబందాలు కలిగి వున్నవారే. అందులోనూ వెలమ, కాపు సామాజిక వర్గాలు బొత్సాకు ఔట్రేట్ గా మద్దతు ఇస్తాయి. అటు పీలా గోవింద్ బలం ఆర్ధికం ఒకే అయినప్పటికీ.. బలం మాత్రం కూటమి నేతలు, వారి పదవులు.. అధికారపార్టీగానే కనిపిస్తున్నాయి. కానీ ఓటర్లను మాత్రం ఎవరి స్థాయిలో కన్ ఫ్యూజ్ చేసి మరి రౌండప్ చేసేస్తున్నారు. చూడాలి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో రాజకీయం ఎన్ని రకాల మలుపులు తిరిగి ఎవరిని ఎమ్మెల్సీ కుర్చీ అధిష్టించేలా చేస్తుందోననేది ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో కూటమిని చేధిస్తే మాత్రం బొత్స బలవంతుడేనని మరోసారి రుజువుతుంది. మరి కాదా..బొత్సాకి ఎవరు ఎదురెల్లి గెలిసెత్తారు అన్నవారే.. జస్ట్ సీన్ రివర్స్ అయితే.. ఏటి సేత్తాం.. ఎమ్మెల్సీ సీటు కూడా పోనాది అని సరిపెట్టుకోవడమే అనేస్తారు.. రాజకీయం అంటే ఇదే కదా మరి..!