మీరే కోవిడ్ 19 సూపర్ స్టార్స్..


Ens Balu
3
కలెక్టరేట్
2020-09-29 20:34:53

మీరే కోవిడ్ 19 సూపర్ స్టార్స్  అంటూ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరిస్తూ, కోవిడ్ 19 నేపథ్యంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, సిబ్బంది, కార్మికులు నిస్వార్థ సేవలు అందించారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని ఎన్ ఐ సి భవనం లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో  రూపొందించిన "మీరే కోవిడ్ 19 సూపర్ స్టార్స్" అనే పోస్టర్ లను  కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ 19 సమయంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, గ్రామ/ వార్డు సచివాలయాల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు చూపిస్తున్న నిబద్ధత కు ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో మీ నిస్వార్ధమైన సేవ ప్రజలను కోవిడ్ నుంచి సురక్షితంగా ఉంచుతోందన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మా గౌరవాన్ని, మద్దతు తెలియజేస్తున్నామన్నారు. కోవిడ్ నేపథ్యంలో డాక్టర్లు చూపించిన నిబద్ధతకు ధన్యవాదాలని, డాక్టర్లు అందించిన వైద్య సేవలు, శ్రమ ఎన్నో ప్రాణాలను రక్షించినట్లు తెలిపారు. అలాగే ఆశ, అంగన్వాడీ వర్కర్లు, ఎఎన్ఎంలు, స్టాఫ్ నర్సు లు కోవిడ్ లాక్ డౌన్ సమయంలో కూడా ప్రతి గర్భిణికి మరియు పిల్లలకు సేవలు అందించి వారి బాగోగులు చూసుకున్నారన్నారు. గర్భిణీలకు అవసరమైన సేవలు అందించడం చాలా కఠిన మని, వారికి అవసరమైన అన్ని ఏఎంసి పరీక్షలు, సేవలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని వీధులను, పట్టణాలను శుభ్రంగా ఉంచినందుకు, ప్రతి ఇంటిలోనూ చెత్తను సేకరించి రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించేందుకు పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.  "మీరే కోవిడ్ 19 సూపర్ స్టార్స్" అనే పోస్టర్ లను జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని గ్రామ /వార్డు సచివాలయాలు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీ లు, మండల స్థాయి కార్యాలయాలకు తరలించి ఈ పోస్టర్లను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్(ఆసరా మరియు సంక్షేమం)గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్య, అడిషనల్ డిఎంఅండ్హెచ్ఓ పద్మావతి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రామస్వామి నాయక్, డెమో లక్ష్మీ నరసమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.