విశాఖ ఉక్కుకోసం ఉద్యమాలన్నీ వేస్టేనా..?!


Ens Balu
123
visakhapatnam
2024-09-16 19:19:03

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది ఒకప్పటి మాట.. విశాఖ ఉక్కు కేంద్రం హక్కు ఇది నేటి మాట. అవును ఎవరు బాధపడినా.. మరెవరు ఆనందపడినా ఇది నిజం. కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నిజం. విశాఖ కోసం నాడు చేసిన ఉద్యమం.. అదే విశాఖ కోసం నేడు చేస్తున్న ఉద్యమం కేంద్రానికి అస్సలు పట్టలేదు. సరికదా..కేంద్రంలోని ఖాయిలా పడ్డ పరిశ్రమల్లో విశాఖ ఉక్కు మాత్రమే ప్రధమ స్థానంలో ఉందని తేల్చి చెప్పింది. అంతేకాదు.. రాజ్యసభ సభ్యులు గొల్లబాబూరావు పార్లమెంటులో వేసిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం కూడా ఇచ్చారు. విశాఖ ఉక్కుని ఖచ్చితంగా ప్రైవేటు పరం చేసేస్తామని. ఇక మేటర్ క్లియర్ అయిపోయింది కదా..

 అయితే విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)ను ప్రైవేటు పరం చేస్తే సహించం అని తెలుగుదేశం నాయకులు చెబుతున్నప్పటికీ  కేంద్రం మాత్రం ఆ దిశగా చక చకా అడుగులు వేసుకొని పోతోందని అధికారికంగా ప్రకటించడం పట్ల ఉత్తరాంధ్ర ఉప్పెనై పైకి లేస్తున్నా.. కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు విషయంలో లిఖిత పూర్వక హామీ మాత్రం తేలేకపోయింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావుకు ఈనెల సెప్టెంబరు 10వ తేదీన రాసిన లేఖ ఈరోజు విశాఖలో ఆయన బయట పెడితే తప్పా అసలు విషయం బయటకు రాలేదు.. గత అయిదేళ్లగా వైఎస్సార్సీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం నుంచి నిర్ధిష్టమైన హామీ తీసుకురాలేకపోవడం విశాఖ ఉక్కు రాజకీయాలకు వేదికైంది.

 విశాఖ ఉక్కులో పెట్టుబడులను ఉపసంహరించుకోడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి రాజ్య సభ సభ్యునికి రాసిన లేఖ వెల్లడించారు. అంతే కాకుండా ఆత్మ నిర్భర్ భారత్ పాలసీ ద్వారా కొత్త పబ్లిక్ సెక్టార్ పాలసీకి కేంద్రం అనుమతించిందని కూడా పేర్కొన్నారు. నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లలో వుండే పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ్స్ను ప్రైవేటు రంగానికి ఇచ్చేయడమో, లేదా మూసి వేయడమో చేస్తామని మంత్రి స్పష్టంగా ఈ లేఖలో తెలియజేశారు. అంతే కాదు ఉక్కు పరిశ్రమ నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లో వుందని కూడా మంత్రి పంకజ్ చౌదరి గుర్తు చేస్తూ చావు కబురు చల్లగా చెప్పారు. దీనిని బట్టి చూస్తుంటే నాడు ఉక్కో కోసం చేసిన ఉద్యమాలు.. ఇపుడు దానిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ఉద్యమాలు వేస్టేనని తేలిపోయింది.  ఎవరేమనుకున్నా విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోయితుందనే అధికారిక లేఖ ఇపుడు రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపుతోంది. మరోవైపు ఈ విషయమై అటు వైఎస్సార్సీపీ, ఇటు కూటమి ప్రభుత్వాలు ప్రజలను నేటికీ మభ్య పెడుతూనే ఉన్నాయి..

 విశాఖ ఉక్కుపై మీ స్టాండ్  ఏంటంటే మీ స్టాండ్ ఏంటంటూ మీడియా వేదిక ముష్టి యుద్దాలు కూడా చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వం నుంచి సాగుతున్న ఈ వ్యవహారం కూటమి స్నేహబంధంలో ఆగుతుందని అంతా అనుకున్నారు. అయినా కేంద్రం తన పనిని తాను చల్లాగా చేసుకుపోతుందని తేలిపోయింది. ఎవరేమనుకున్నా మాకు వినపడదు.. కనపడదు.. అన్నట్టుగానే కేంద్రం వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితుల్లో అటు వైఎస్సార్సీపీ, ఇటు కూటమి ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కోసం చేస్తున్న ఉద్యమాలు చేస్తున్న కార్మికులకి, ఉత్తరాంధ్ర సెంటిమెంట్ అనుకున్న ఈ ప్రాంత ప్రజలకు కేంద్రం ద్వారా ఎలాంటి సమాధానం మళ్లీ రాజకీయంగా చెప్పిస్తారనేది కోటి డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. కేంద్రం అనుకున్నట్టుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణా లేదంటే..ఉత్తరాంధ్ర ప్రజల మనోభవాలపై నీళ్లా.. కాదంటే రాజకీయంగా పైచేయా..? ఎవరు ఏం చేస్తారనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.