విశాఖలో నర్సింగ్ సీట్లు అడ్డగోలుగా అమ్మేస్తున్నారు..!


Ens Balu
171
visakhapatnam
2024-09-25 02:26:38

విశాఖజిల్లాలో ప్రైవేటు నర్సింగ్ కాలేజీల్లో జీఎన్ఎం సీట్ల వ్యాపారం మూడుపువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది.. ఒక్క ప్రైవేటు కళాశాల కూడా వెబ్ కౌన్సిలింగ్ మొదలు కాకుండానే అపుడే 70శాతం సీట్లు అమ్మేశాయంటే జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంతో ఏ స్థాయి ఒప్పం దాలు జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రైవేటు నర్శింగ్ కళాశాలల్లో ఒక్కో మేల్ జిఎన్ఎం సీటు ఏడాదికి రూ.75వేలు, మహిళలకు రూ. 55వేలు చొప్పున అమ్మేస్తున్నారు. ఇదేదో చీకటిలో బాణం వేసి చెబుతున్న మాటలు కాదు. ఈఎన్ఎస్-ఈరోజు స్వయంగా కొన్ని ప్రైవేటు కాలేజీల్లో సీటు కోసం విచారణ చేస్తున్నట్టు విద్యార్ధిగా వెళ్లి మరీ విచారణ చేస్తే అసలు విషయాలు బయట పడింది. మేనేజ్ మెంట్ సీట్లు ప్రైవేటు కళా శాలల ఇష్టం...కానీ కన్వీనర్ కోటా సీట్లు కూడా కౌన్సిలింగ్ మొదలు కాకుండానే అమ్మేస్తున్నారంటే నర్సింగ్ కళాశాల్లో జీఎంఎసం సీట్ల అమ్మ కాలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా  అడ్డగోలుగా అమ్మేస్తున్న నర్శింగ్ కళాశాలల సీట్ల అమ్మకంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తే వాస్తవ పరిస్థితి వెలుగు చూస్తుంది.

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో కింగ్ జార్జి ఆసుపత్రి అనుబంధ ప్రభుత్వ నర్శింగ్ కళాశాలతోపాటు ప్రైవేటుగా 27 నర్శింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాల కళాశాల తప్పితే  మిగిలిన అన్ని కాలేజీల్లోనూ 70-80శాతం సీట్లు అమ్మేశారు. అంతేకాదు. కొన్ని కాలేజీల్లో మేల్ నర్శింగ్ కి అడ్మిషన్లు ఇవ్వడం లేదు. అదేమని ప్రశ్నిస్తే అదంతా జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులం మేమూ చూసుకుంటామని.. మీ మీడియా వాళ్లు ఏం రాసుకున్నా ఇబ్బందేమీ లేదని.. మీ పని మీరు చూసుకోండని..మా పని, మా సీట్ల అమ్మకం మేము చేసుకుంటామని తెగేసి చెబుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఇంటర్ పాసైన విద్యార్ధులు ఆన్ లైన్ లో బిఎస్సీ నర్సింగ్, జిఎన్ఎస్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా అనుమతి ఇచ్చింది. సదరు వెబ్ సైట్ లోని ప్రైవేటు నర్శింగ్ కళాశాలలన్నీ ప్రభుత్వం అడ్మిషన్లకు అనుమతి ఇచ్చిన తరువాత మాత్రమే సీట్లు భర్తీచేయాలి.

 కాకపోతే మేనేజ్ మెంట్ కోటా సీట్లు మాత్రం ఎప్పుడు భర్తీచేసుకున్నా దానికి ప్రభుత్వం అనుమతి అవసరం ఉండకపోవచ్చు. అదీ కన్వీనర్ కోటా సీట్లు భర్తీ జరిగిపోతే. కానీ విశాఖలో మాత్రం ప్రభుత్వం జిఎన్ఎంకి సీట్లకు దరఖాస్తు చేసే సమయంలోనే విశాఖలోని కాలేజీల్లోని సీట్లన్నీ అమ్మేస్తున్నారు. ఇలా అక్రమంగా..అడ్డగోలుగా ప్రైవేటు నర్శింగ్ కాలేజీలు సీట్లతో లక్షల వ్యాపారం ప్రభుత్వ అనుమతులు రాకుండానే చేస్తున్నా.. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి గానీ, కార్యాలయంలోని సంబంధిత విభాగంలోని సిబ్బంది కానీ నోరు మెదపడం లేదు. అటు ప్రైవేటు కాలేజీలు ఆరోగ్యశాఖ అధికారులకు వారుచేసే వ్యాపారానికి సహకారం అందిస్తుండటంతో నిబంధనలకు విరుద్దంగా సీట్ల భర్తీచేసుకోవడానికి వ్యాపారం చేస్తున్నందుకు సీటుకింత లెక్కన కమిషన్లు ఇస్తున్నట్టు సమాచారం అందుతుంది. పైగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలోని సిబ్బందే ఏ కాలేజీలో ఫీజులు తక్కువగా ఉంటాయి..మరే కాలేజీలో ఎక్కువగా ఉంటాయి.. వారి సిఫారసులు ఎక్కడ పనిచేస్తున్నాయో కూడా చెబుతుండటం విశేషం. 

అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు తీసుకొని కౌన్సిలింగ్ తేదీ వరకూ కార్యాలయంలోనే ఉంచాలనే నిబంధనలను వారే స్వయంగా ఉల్లంఘించి ప్రైవేటు కాలేజీలకు పంపిమరీ అడ్మిషన్లకు సహకరిస్తుండటం ఇక్కడ అనుమానాలకు తావిస్తున్నది. ఇదే విషయమై ఈఎన్ఎస్-ఈరోజు నేరుగా చరవాణిలో విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా డిఎంహెచ్ఓ స్పందించలేదు. విశాఖలోని అడ్డగోలు నర్సింగ్ కాలేజీల్లోని జీఎన్ఎం సీట్లు కౌన్సిలింగ్ అమ్మకాలు చేస్తున్న వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తే వైద్యఆరోగ్యశాఖ కార్యాల యంలోని ఈ తేడా వ్యవహారంపై ఎందుకు స్పందించలేదనే విషయం బయటకు వస్తుంది.