ఆంధ్రయూనివర్శిటీ లో ర్యాగింగ్ రక్కసి..!


Ens Balu
249
visakhapatnam
2024-10-07 19:30:01

ఆంధ్రయూనివర్శిటీలో మళ్లీ ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుంది..గత కొంత కాలంగా బయటకు రాని వ్యవహారం విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి రావడంతో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ర్యాగింగ్ విషయం మరోసారి బట్టబయలు అయ్యింది. విశాఖలోని ఏయూలో ర్యాగింగ్ కలకలం రేపింది. అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్‌ విద్యార్థినులపై కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టారు. అంతేకాకుండా వాటిని వీడియోలు తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో కూడా పెట్టారు. ర్యాగింగ్‌ అంశం బయటకు రావడంతో స్పందించిన కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఆర్కిటెక్చర్‌ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థినులతో కొంతమంది సెకండ్‌ ఇయర్‌ విద్యార్థినులు దురుసుగా ప్రవర్తించారు. హాస్టల్‌ రూమ్‌లో అసభ్యకరమైన డ్యాన్సులు చేయాలంటూ ఒత్తిడి చేశారు. అలా చేయలేం.. మాకు డ్యాన్స్‌ రాదని చెబితే.. అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకుని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారు. 

అంతేకాకుండా ర్యాగింగ్‌ సమయంలో సీనియర్లు వీడియోలు తీసి వాట్సాప్‌ గ్రూప్‌ల్లో షేర్‌ చేశారు. వాటికి మరికొంతమంది సీనియర్లు కామెంట్లు పెట్టారు. ర్యాగింగ్‌ విషయాన్ని ప్రొఫెసర్ల దృష్టికి తీసుకెళ్తే సీనియర్లు తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తారేమో అని జూనియర్లు భయపడిపోయారు. ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో చివరకు కొంతమంది విద్యార్థినులు మీడియాను ఆశ్రయించడంతో ర్యాగింగ్‌ విషయం బయటకొచ్చింది. ర్యాగింగ్‌ అంశం బయటకు రావడంతో కాలేజీ యాజమాన్యం ఘటనపై ఎంక్వైరీ చేయించింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్‌ చేసింది. అంతేకాకుండా ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే విద్యార్ధుల తల్లిదండ్రులకు ముందు కౌన్సిలింగ్ చేయడంతో పాటు.. ర్యాగింగ్ కి పాల్పడే వారి ఫోటోలు, వీడియోలు,  వివరాలు మీడియాకి నేరుగా ఇచ్చే యోచనకి వస్తే ఇలాంటి చర్యలు ఉపక్రమించరని బాధిత విద్యార్ధిని తల్లిదండ్రులు గొల్లుమన్నారు. 

ఇలాంటి ర్యాగింగ్ లు వారింట్లో అక్కకో.. చెల్లికో.. తల్లికో జరిగితే ఎలావుంటుందంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కాగా ఈ విషయాన్ని విశాఖ నగర పోలీస్ కమిషనర్ కూడా సీరియస్ గానే తీసుకున్నట్టు తెలిసింది. అంతేకాకుండా ఆంధ్రాయూనిర్శిటీపై ఒక కన్నేసి ఉంచాలనే యోచనకు వచ్చినట్టు సమాచారం అందుతుంది. చాలా కాలంటా యూనివర్శిటీలో ర్యాంగింగ్ లు జరుగుతున్నా.. అవిబయటకు పొక్కలేదు. కానీ సోమవారం జరిగిన ర్యాగింగ్ శృతిమించడంతో మీడియాలో రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే యూనివర్శిటీల్లో ర్యాగింగ్ బయట పడటంపై ఇదంతా ఒక పథకం ప్రకారమే చేస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని రాజకీయం చేయాలని కూడా కొందరు చూస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. కాగా యూనివర్శిటీలో ర్యాగింగ్ జరిగిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు విశాఖ చేరుకుంటున్నారు. కొందరు ఫోన్లలో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ విషయంలో ఆంధ్రాయూనివర్శిటీ యాజమాన్యం.. అధికారులు.. పోలీసులు నేటి నుంచి ఏ విధంగా స్పందిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.