మనోడనే రూ.40కోట్ల కాంట్రాక్టులు ఆయనకే ఇచ్చేశారు..?!


Ens Balu
53
visakhapatnam
2024-11-14 15:11:49

వడ్డించేవాడు మనోడైతే బంతి చివరన కూర్చున్నా విస్తరంతా నిండుతుందన్నట్టు.. కోట్లాది రూపాయల సివిల్ వర్క్స్ లో  వాటాలు అడ్డంగా బొక్కాలనుకున్నా మనోడనే ముద్ర వేసి, నిబంధనలు ప్రక్కన పెట్టి అన్ని కాంట్రాక్టులు ఒకరికే ఇచ్చేయొచ్చు.. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్(ఏపీటిడిసి)లో కూడా అదే జరిగింది. రాష్ట్ర కార్యాలయంలో ఓ ముఖ్య అధికారి తన బినామీగా ఒక వ్యక్తిని కాంట్రాక్టర్ గా తెరమీదకు తీసుకు వచ్చి అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడు. సివిల్ పనులు మాత్రమే కాంట్రాక్టర్ కి అప్పగించి.. ఇతర కమర్సియల్ కొనుగోళ్లు మొత్తం అన్నీ ఢిల్లీ కేంద్రంగా చేపట్టి ఆ అధికారే అంతా దగ్గరుండి చూసుకుంటున్నాడంటే ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో బురిడీ కొట్టించాడో అర్ధం చేసుకోవచ్చు. ఒకరికే కాంట్రాక్టు పనులు అప్పగిస్తే.. ఖర్చులు పెరిగాయని కాంట్రాక్టర్ తో ఆర్ధిక భారమని చెప్పించి కూడా అదనపు ఎస్టిమేషన్లుతో వర్క్ ఆర్డర్ లేకుండా అదనపు నిధులు కొల్లగొట్టవచ్చునని మాస్టర్ ప్లాన్ వేశారు.. ఇపుడు దానిని అమలు చేయడానికి టెండర్ దక్కించుకున్న రేటు కంటే అదనపు ఎస్టిమేషన్లు వేసి ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న వైనం ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నది. ఏపీటిడిసిలో మరమ్మతుల పేరిట ప్రజాధనాన్ని కొల్లగొడుతూ హరికథలు చెబుతున్న వ్యవహారంపై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు దారావాహికం పార్ట్-2 ద్వారా అంది స్తున్నది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏపీ టూరిజం కార్పోరేషన్(ఏపీటిడిసి) కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నది.. కాదు కాదు ఇదేశాఖలో పనిచేసిన ఒక ముఖ్య అధికారికి బినామీగా ఉన్న కాంట్రాక్టర్ ద్వారా అడ్డదారిలో ఆదాయం వస్తున్నది. ప్రజా ధనం కొల్లగొట్టి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి.. ప్రభుత్వ నిబంధనలను ప్రక్కన పెట్టి టార్గెట్ పెట్టుకున్న మొత్తం ప్రభుత్వం నుంచి రాబట్టడానికి అన్ని అడ్డదారులూ తొక్కుతున్నారు ఏపీటిడిసిలోని అధికారులు. స్వయంగా పర్యాటకశాఖ మంత్రే ఈ తేడా కాంట్రాక్టు పనులపై ఆగ్రహం వ్యక్తం చేసినా.. కార్పోరేషన్ చైర్మన్ వాస్తవాలు బయటకు తీస్తామని హెచ్చరించినా.. అవేమీ ఏపీటీడిసిలోని అధికారులను ఏమీ చేయలేకపోతున్నాయి. పైగా బినామీగా పెట్టిన కాంట్రాక్టర్ కే ఏకంగా రూ.40 కోట్ల పనులు అప్పగించి మరీ పనులను సా..గదీస్తున్నారు. 

ఈ క్రమంలో పర్యాటకుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే సుమారు రూ.10కోట్ల ఆదాయం పోయినా.. ప్రభుత్వాన్ని నమ్మించ గలుగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొదలైన ఈ తేడా పనుల బాగోతం బయటకు రాకుండా మీడియాకి కూడా లక్షల రూపాయలు ముడుపులు ఇచ్చారని సమాచారం అందుతుంది. లేకపోతే కోట్లాది రూపాయాల టెండర్ పనులను అడ్డగోలుగా పెంచేసి మరో ఐదుకోట్లు ప్రభుత్వం నుంచి లాగేయలని చూస్తున్నా.. ఏ ఒక్కరూ ఈ విషయంలో కన్నెత్తి కూడా చూడటం లేదు.. అలా చూడకుండా చేసినందుకు అయిన ఖర్చు మీడియా వాటాగా రూ.25 లక్షలకు పైగా ఖర్చుచేశారట. ఒక్క మీడియాకే రూ. 25 లక్షలు ఖర్చు చేస్తే.. ఇందులో తేడా వ్యవహారాలను వెనుకేసుకు వచ్చే అధికారులకు ఏ స్థాయిలో వాటాలు ముట్టిఉంటాయో వేరేగా చెప్పాల్సిన పనిలేదు.

ఏపీటిడిసిలో విశాఖలోని హరిత యాత్రీ నివాస్ అప్పుఘర్, హరిత హిల్ రిసార్ట్ అనంతగిరి, హరిత వ్యాలీ రిసార్ట్ అరకు, హరిత హిల్ రిసార్ట్ మయూరిలలో మరమ్మతు పనులకు సంబంధించి ఒకే కాంట్రాక్టర్ కు రూ.40కోట్ల పనులు అప్పగించేశారు అధికారులు. ఇందులో కేవలం సివిల్ పనులు మాత్రమే కాంట్రాక్టర్ ఆ ముఖ్య అధికారికి బినామీగా ఉన్న కాంట్రాక్టర్ చేపడుతుండగా.. హోటల్స్ లో కొనుగోలు చేసే పరుపులు, ఇతర ఫర్నిచర్, టివిలు అన్నీ ఢిల్లీలోని ఓ కంపెనీతో సంబంధం పెట్టుకొని.. అన్నీ అధిక ధరలకు కోట్ చేయించారట. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ పూర్తయితే తప్పా ఏ వస్తువుకి ఎంత రేటు పెట్టి కొన్నారన్న విషయం బయటకు రాదు. ఈ పనులన్నీ ఇదేశాఖలోని అధికారులను పెట్టి చేయిస్తే వాస్తవాలు బయటకి వచ్చేస్తాయని గుర్తించిన ఆ రాష్ట్ర అధికారి ఇరిగేషన్ లో పనిచేస్తున్న ఈఈని ఏపీటీడిసికి అధికారిగా డిప్యూటేషన్ పై తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది. ఈయన ఆధ్వర్యంలోనే ప్రభుత్వ టెండర్ల ఖర్చుకంటే అధనంగా ఖర్చులు అయ్యాయని చెప్పి ఎక్సట్రా ఎస్టిమేషన్లు వర్క్ ఆర్డర్ లేకుండా పంపి మరీ ప్రభుత్వం నుంచి నిధులు కొల్లగొడుతున్నారు కాంట్రాక్టర్లు.. ఇంత జరుగుతున్నా.. విశాఖజిల్లా, అల్లూరి జిల్లా 
కలెక్టర్లు ఈ తేడా పనులపై కన్నెత్తి చూడటం లేదు.

ఉమ్మడి విశాఖజిల్లాలో ఏపీటిడిసి హోటళ్లు మరమ్మతులు చేపట్టే సమయంలోనే ఇక్కడ పనులను సా..దీసి చేపట్టినందుకు నగరంలోని కొన్ని ప్రైవేటు హోటళ్ల నుంచి ముడుపులు కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. ఏపీటిడిసి వసతి లేకపోతే పర్యాటకులు ప్రైవేటు హోటళ్లను ఆశ్రయిస్తారు. అలా ప్రైవేటు హోటళ్లలో ఆతిథ్యం పొందినవారు మళ్లీ ఏపీటిడిసి హోటళ్లకు రావాలంటే అది కల. అత్యంత తక్కువ మొత్తంలోనే దొరికే ఏపీటిడిసి రిసార్ట్ లు హోటళ్ల లో ఆతిథ్యాన్ని ప్రైవేటు హోటళ్లకు మరమ్మతుల ముసుగులో దారిమళ్లించడానికి కూడా ప్రత్యేక ప్యాకేజీలు తీసుకున్నారట. ఈ నేపథ్యంలో ఏపీటీడిసికి రావాల్సిన సుమారు రూ.10కోట్లు ప్రైవేటు హోటళ్లు కొట్టేశాయి. ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్న ఒక్క అప్పుఘర్ హరిత యాత్రీ నివాస్ ద్వారానే నెలకి సుమారు రూ.60 లక్షల నుంచి రూ.80లక్షలు ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నది. తద్వారా ప్రభుత్వం నష్టాన్ని భరించి.. ఉద్యోగులకు కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సి వస్తున్నది. 

ఏపీటిడిసి హోటళ్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొల్లగొట్టడానికే మరమ్మతులు చేపట్టి.. దాని ద్వారా కూడా కోట్లాది రూపాయలు కొల్లగొట్టడానికే ఆ రాష్ట్ర అధికారి మాస్టర్ ప్లాన్ వేశారని చెబుతున్నారు. వర్క్ ఆర్డర్, టెండర్ లేకుండా అదనపు ఎస్టిమేషన్లు పంపిన విషయంలోనూ నిధులు రాబడుతున్న విషయంలో విశాఖ జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తే పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ఏపీటిడిసీలో అక్రమాలను తన బినామీ కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తూ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తున్న ఆ రాష్ట్ర అధికారి బాగోతాలను వరుస కథనాల రూపంలో ఈరోజు-ఈఎన్ఎస్ బయట పెట్టడానికి తన నెట్వర్క్ ను విశాఖపట్నం నుంచి అమరావతి వరకూ యాక్టివేట్ చేసింది. ఈ అక్రమాలు బయట పడకుండా ఉండేందుకు ఏ మీడియాకి ఎంతెంత ఖర్చు చేశారు ఎవరి ద్వారా  ఆ వివరాలను కూడా రానున్న కథనాల్లోబయట పెట్టనున్నాం. అంతేకాకుండా ఏపీటీడిసిలోని అధికారులను ప్రక్కనపెట్టి ఇతర శాఖల నుంచి అధికారులను ఇక్కడికి తీసుకొచ్చిన విషయంలో ఎవరు కీలక పాత్రపోషించారో కూడా జిల్లా కలెక్టర్ విచారణ చేపడితే బయటకు వచ్చే అవకాశాలున్నాయి..!