ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలెప్ మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో అంచనాలకు మించి నాణ్యతాలోపంగా జరుగుతున్న హరిత యాత్రీ నివాస్ పనులపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పరిశీలన చేస్తే చాలా విషయాలు వెగులు చూసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇక్క డ రూ.8 కోట్లతో మరమ్మతులు, గదుల్లో ఫర్నిచర్, ఇంటీరియర్ డెకరేషన్లు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం కేటా యించిన రూ.8 కోట్లతో ప్రస్తుత యాత్రీ నివాస్ ఉన్న చోట ఆ బవంతిని మొత్తం కూల్చివేసి కొత్తదే నిర్మించవచ్చు. కానీ ప్రభుత్వంలో నిబం ధనలను సొమ్ము చేసుకోవడానికి ఏపీటీడీసి రాష్ట్ర అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై చేస్తున్న పనులపై కనీసం జిల్లా కలెక్టర్ పరిశీలన లేకపోవ డం, అక్కడ జరుగుతున్న పనుల నాణ్యత తెలుసుకోకపోవడం, కాంట్రాక్టర్ ఎందుకు అదనంగా మరో రూ.5 కోట్లు పెంచాలని ఏపీటీడీసీకి లేఖ రాయడం.. దానిని ప్రస్తుతం ఇన్చార్జి ఆర్డీగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్ ఇఇ కూడా ఆమోదించి పంపడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. గ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి.
ఫలితంగా ప్రభుత్వానికి ఇప్పటి వరకూ సుమారు రూ.10కోట్లు నష్టం ఏర్పడింది. ప్రస్తుతం పర్యాటకులు అధికంగా వచ్చే సీజన్ కావడంతో ఈ సీజన్ నాటికి కూడా యాత్రీ నివాస్ పూర్తికాకపోవడంపై పంపకాల్లో తేడాలొచ్చాయని సమాచారం అందుతుంది. టెండరు ప్రకారం రూ.8 కోట్లు కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నా.. జిల్లా కార్యాలయం నుంచి రష్ట్ర కార్యాలయం వరకూ కమిషన్లు ఇచ్చిన కారణంగానే ప్రభుత్వ టెండరు కంటే అధికంగా మళ్లీ ప్రభుత్వానికి నివేధించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం విశాఖలోని అప్పుఘర్ హరిత యాత్రీ నివాస్ లో జరుగుతున్న మరమ్మతు పనులపై విజిలెన్స్ విచారణ చేసినా.. థర్డ్ పార్టీ విచారణ చేపట్టినా ఇక్కడ లోప భూఇష్టంగా జరుగుతున్న పనులు వెలుగు చూసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆర్డీ ఈ విషయమై ఇప్పటి వరకూ రాష్ట్ర కార్యాలయానికి గానీ, జిల్లా కలెక్టర్ కి గానీ జరుగుతున్న పనులపై నివేదికలు ఇచ్చినట్టు కనిపించలేదని తెలుస్తున్నది. ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, కార్పోరేషన్ చైర్మన్లు సైతం ఇక్కడ రూ.8 కోట్లతో జరుగుతున్న పనులను చూసి నివ్వెర పోయారు.
అంతేకాదు.. అదనంగా మరో రూ.5 కోట్లు కి ఖర్చుపెంచాలని చేసిన ప్రతిపాదనలపైనా కన్నెర్ర చేశారు. ఇంత జరిగినా... ఏపీటీడీసీ రాష్ట్ర అధికారులకి చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా అడ్డగోలుగా ఈ విషయం బయటకు రాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్డీ శ్రీనివాస్ పాణిని తిరిగి మాతృశాఖకు పంపేయడంతోపాటు, శ్రీకాకుళం జిల్లా నుంచి మరోఅధికారి జిల్లా మేనేజర్ గా రాత్రికి రాత్రే నియమించేశారు. వాస్తవానికి ఇక్కడున్న టూరిజం అధికారులకు ఆర్డీ, లేదా జిల్లా మేనేజర్ ఇన్చార్జి అప్పగిస్తే అసలు ఒకే వ్యక్తికి రూ.40 కోట్లు టెండర్లు ఎలా ఇచ్చారు. ఏం పనులు చేశారు.. నాణ్యత ఎంత..? ప్రభుత్వానికి ఎంత మేర నష్టం వచ్చింది.. తదితర అంశాలన్నీ లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి అందే అవకాశముంది.
అవన్నీ బయటకు రాకుండా చేయడానికే టూరిజం శాఖ అధికారులకి, ప్రస్తుతం ఉన్న సిబ్బందికి కాకుండా బయట శాఖల అధికారులను ఇన్చార్జిలుగా నియమించి ఇక్కడ జరుగుతున్న అంశాలన్నీ గంపకింద కప్పెట్టాయని ఏపీటీడీసీ అధికారులు చూస్తున్నారు. ఇవన్నీ ఆధారాలతో సహా ప్రభుత్వానికి తెలియాలంటే ఏపీటీడీసీలో జరుతుగున్న పనులపై జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలన చేసినా... థర్డ్ పార్టీ నిర్మాణ సంస్థలతో లెక్కలు కట్టించినా ఇక్కడి అధికారులు తేడా పనుల వ్యవహారాలన్ని వెలుగు చూసే అవకాశం ఉంది..? మరి జిల్లా కలెక్టర్ వాటిని నిగ్గు తేలుస్తారా.. డిల్లీ సరుకు అసలు రేటు బయట పెడతారా..?!