మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటుచేసిన మెప్మా ఇప్పుడు అవినీతిపరులకు ఆదాయ వనరుగా మారింది. కంచె చేను మేసిందన్న చందంగా విధులు నిర్వహహించాల్సిన సిబ్బంది అక్రమాలకు తెరతీశారు. ధర్మవరం పట్టణ పేదిరక నిర్మూలన సంస్థ (మెప్మా)లో రుణాల పేరుతో జరిగిన గోల్‌మాల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. లేని పొదుపు సంఘాలను ఉన్నట్లుగా చిత్రీకరించి మాయచేసేస్తున్నారు. ఆన్‌లైన్‌లో గ్రూపులు కనిపించకుండా మొత్తంగా బోగస్ రుణాలతో భారీగా దోచేశారు. నకిలీ గ్రూపులతో బ్యాంకును బురిడీ కొట్టించి రూ. అర కోటి మేర రుణాలు దోచుకున్న వారి గుండెల్లో గుబులు మొదలైంది. అదే సమయంలో రుణాలు బొక్కేసిన సిబ్బంది తప్పులు కప్పిపుచ్చు కునేందుకు దారులు వెతుకుతున్నారు. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలని, బ్యాంకులకు తామే సొమ్ము చెల్లిస్తామని బ్యాంకు మేనేజర్ , పొదుపు మహిళల చుట్టూ తిరుగుతున్నారు.
-మెప్మా లక్ష్యం
పట్టణంలోని పేద మధ్యతరగతి మహిళల స్వయం ఉపాధి ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు మెప్మా ఆధ్వర్యంలో రుణాలు ఇస్తుంటారు ఇందులో బ్యాంక్ లింకేజీ లోన్లు అన్ని సంఘాలకు ఇస్తారు వాయిదాల చెల్లింపులు మెరుగైన రికార్డు ఉన్న కొన్ని సంఘాలను గుర్తించి వారికి శ్రీనిధి రుణాలు అందిస్తుంటారు ఏ రుణం తీసుకోవాలన్న సంఘ సభ్యులు సామూహిక తీర్మానం తప్పనిసరి సభ్యుల ప్రతిపాదన ఆర్పీలు, సిఆర్పిలు నివేదిస్తారు. రుణం కావలసిన సంఘం సభ్యులతో సిఆర్పిలు సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకుంటారు అనంతరం బ్యాంకులకు అందజేస్తారు మొత్తంగా రుణాల మంజూరులో మెప్మా సిఆర్పి, ఆర్పి, బ్యాంక్ అధికారుల పాత్ర కీలకము ఉంటుంది.అయితే ఈ బాగోతం మెప్మా జిల్లా అధికారులకు తెలిసినప్పటికీ చర్యలకు వెనుకడుగు వేయడం అనుమానాలకు తావిస్తోంది. అవినీతి వ్యవహారంలో వారికీ వాటా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-బయటపడిందిలా..
బోగస్ రుణాలు తీసుకున్న కొన్ని గ్రూపులు సభ్యులను రుణాలు తీసుకున్నట్లు సమాచారం అందడంతో ఒక్కసారిగా హులిక్కి పడ్డారు . సభ్యులు తీసుకున్న రుణం కంటే మూడింతలు రుణం తీసుకున్నట్లు సదరు బ్యాంకు నుండి ఎస్. ఏం. ఎస్ రావడంతో ఒకింత ఆందోళనకు గురైన కొందరు సభ్యులు బ్యాంకు మేనజర్ కలిశారు . మేము తీసుకున్నది సొమ్ము ఒకటే అయితే మాకు ఎస్. ఏం. ఎస్ పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నట్లు వచ్చిందని తెలిపారు . దీంతో అప్రమత్తమైన బ్యాంకు మేనజర్ మెప్మా సిబ్బందితో విచారణ చేస్తే అసలు విషయం వెలుగులోకి ఈ వ్యవహారంలో మెప్మా అధికారులు మౌనందాల్చగా, కొందరు బ్యాంకు సిబ్బంది సుమారు 5 సంఘాల లీడర్లను పిలిపించి సొమ్ము రికవరీ చేసే పనిలో పడ్డారు . ఒక సంఘం సభ్యులు తీసుకున మొత్తం సొమ్ము చెల్లించినట్టు సమాచారం. ఇంకా 4 సంఘాలు సుమారు రూ. 60 లక్షలు చెల్లించాల్సి ఉంది .
-వాస్తవాలు వెలికితీస్తే మరిన్ని బోగస్ రుణాలు..!
మెప్మాలోని కొందరు సిబ్బంది ఈ రుణ మోసంలో సూత్రధారులుగా వ్యవహరించినట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారం అమాయక పొదుపు మహిళలు ఇబ్బందిపడే అవకాశం ఉంది. అయితే పొదుపు మహిళల పేరుతో నకిలీ గ్రూపులు సృష్టించి లక్షల రూపాయల నిధులు కాజేసిన వైనంపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అంతే కాకుండా భవిష్యత్‌లో ఇలాంటి బోగస్ రుణాలకు కళ్లెం వేసినట్లు అవుతుందని, అలాగే వారిపై చర్య లు తీసుకుని నగదు రికవరీ చేయాలని పలువురు పొదుపు మహిళలు కోరుతున్నారు.
-గోప్యంగా మెప్మా పిడి విచారణ..?
ధర్మవరం పట్టణ పేదిరక నిర్మూలన సంస్థ (మెప్మా)లో రుణాల పేరుతో జరిగిన గోల్‌మాల్ వ్యవహారంపై మెప్మా పిడి విజయలక్ష్మి విచారణలో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో గోప్యంగా సమావేశం నిర్వహించారు . పలువురు పాత్రికేయులు అక్కడికి చేరుకు న్న విషయం తెలిసిన పిడి హుటాహుటిన సమావేశం అర్ధాంతరంగా ముగించి అక్కడ నుండి వెళ్ళి పోయారు. ఇంత జరుగుతున్నా మెప్మా అధికారులు మాత్రం నోరు మెదకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈరోజు-ఈఎన్ఎస్ ఈ విషయమై విచారణ కోరేందుకు ప్రయ త్నించినా మెప్మా అధికారులు స్పదించకపోవడం విశేషం.