ధాన్యం సేకరణలో తేడాలు రాకూడదు..
Ens Balu
3
Srikakulam
2020-09-30 15:42:43
శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం సేకరణలో తేడాలు రాకూడదని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం మిల్లర్ల తో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ధాన్యం సేకరణకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కలెక్టర్ అన్నారు. ధాన్యం సేకరణలో తేడాలు వచ్చినా, రైతులకు ఇబ్బందులు కలిగినా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలో 27 శాతం మేర వర్షపాతం తక్కువగా ఉందని, దాదాపు 20 మండలాలలో కరువు ఛాయలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సమయంలో ఎటువంటి సమస్యలు ఉండరాదని పేర్కొన్నారు. మిల్లులు సార్టెక్స్ కు పెట్టుకోవాలని సూచించారు. బియ్యంలో నూకలు ఎక్కువగా ఉంటున్నాయని ఫిర్యాదులు రావడంతో 1075 రకం విత్తనాలు వేయలేదని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా నిబంధనలు పాటించాలని ఆయన స్పష్టం చేసారు. సేకరణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. సార్టెక్స్ లో ఎటువంటి సమస్య ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. జిల్లాలో పండిన పంటకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. మిల్లర్లకు సమస్యలు రాకుండా సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో తగినంత నిల్వ సామర్థ్యం ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా మిల్లర్ల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు(వాసు) మాట్లాడుతూ గత ఏడాది 60 మిల్లులు సార్టెక్స్ మిల్లులుగా పెట్టుకున్నాయని, ఈ ఏడాది మొత్తం 125 మిల్లులు సార్టెక్స్ కు రానున్నాయని చెప్పారు. జిల్లాలో గిడ్డంగి సమస్య గత ఏడాది తలెత్తిందని, తద్వారా ఉత్పత్తికి తగిన విధంగా నిల్వ సామర్థ్యం ఉండాలని కోరారు. రుణ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. నాలుగు నెలలలో 3 లక్షల టన్నుల మేర సార్టెక్స్ బియ్యం అందించగలమన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఏ.కృష్ణా రావు, డి.ఎస్.ఓ వెంకట రమణ, వ్యవసాయ శాఖ డిడి రాబర్ట్ పాల్, మార్కెటింగ్ ఎడి బి.శ్రీనివాసరావు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.