పోలవరం నిధులు కోత అన్యాయం..
Ens Balu
3
Visakhapatnam
2020-09-30 16:05:41
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ 33 వేల కోట్లకి తగ్గించటం దారుణమని సామాజిక ఉద్యమ నాయకులు తురగా శ్రీరామ్ విమర్శించారు. పోలవరాన్ని రక్షించాలంటూ విశాఖలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ, పోలవరం నిర్వాసితులకు ఇచ్చే ఆర్ & ఆర్ ప్యాకేజీ లోనే 8 వేల కోట్ల మేరకు కోత విధించటం చాలా అన్యాయ మన్నారు. దీనివల్ల నిర్వాసితులకు తీరని అన్యాయం జరుగుతుందని, పోలవరం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పుకొచ్చారు. కేంద్రం ఉత్తరాంధ్రులకు కోలుకోలేని దెబ్బకొట్టాలనే ఈవిధమైన చర్యలకు పాల్పడుతుందని తీవ్రంగా ఆరోపించారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా.. ఉత్తరాంధ్ర కి తీరని అన్యాయం చేస్తూనే వస్తున్నారని... గతంలో రెండు సంవత్సరాలు అధ్యయనం చేసి పోలవరం అధారిటీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ లు 55,548 కోట్లకు పోలవరం రివైజ్డ్ అంచనా వ్యయాన్ని ఆమోదించాయనే విషయాన్ని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఈ మొత్తంలో కోత విధించటంతో అసలు పోలవరం పూర్తి చేసే ఉద్దేశ్యం కేంద్రానికి ఉందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక గత చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరం పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించటం,రివర్స్ టెండర్లు అంటూ హడావుడి చేయడం కూడా కేంద్ర నిర్ణయానికి కారణం అయ్యాయని ఆయన ఆరోపించారు. కానీ పోలవరం పనుల్లో అవినీతిని జగన్ ప్రభుత్వం నిరూపించలేకపోయిందని,కేంద్రం కూడా ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పిందన్నారు. పోలవరం నిధుల కోతలకి వ్యతిరేకంగా కేంద్రం మీద పోరాడాల్సింది పోయి, వాళ్ళ కాళ్ళ దగ్గర జగన్ ప్రభుత్వం మోకరిల్లిందని ఆయన విమర్శించారు. జగన్ అధికారంలోకి రాగానే పోలవరం నిర్వాసితులకు ఎకరాకి 11,52,000 నష్ట పరిహారం ఇస్తామని, ఇల్లు కోల్పోయిన వారికి 3 లక్షలు, కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి 3లక్షల15వేలు, ఒక్కో కుటుంబానికి 7 లక్షలు నష్ట పరిహారం ఇచ్చి, పునరావాస కాలనీల్లో 24 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారని తగ్గించిన వ్యయంతో ఇపుడేం చేస్తారని ప్రశ్నించారు. ఈ ఆగస్టు 15 నాటికి 16000 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని జగన్ చెప్పారని,అది జరగలేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా 200 గ్రామాల్లో 50 వేల కుటుంబాలు,2లక్షల మంది ప్రజలు నిర్వాసితులు అయ్యారన్న ఆయన ఇందులో సగం మంది గిరిజనులే ఉన్నారని, వీరికి న్యాయం జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు గట్టి పోరాటాలకు సిద్ధం కావాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు.