ఉద్యాన పంటలెక్కింపు పూర్తిచేయాలి..


Ens Balu
2
Srikakulam
2020-09-30 18:16:31

శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్న కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంకు సంబంధించిన ఉద్యాన పంటలు, ఇతర మొక్కలకు సంబంధించిన లెక్కింపును త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కొవ్వాడ ప్రోజెక్టుకు సంబంధించిన భూసేకరణ మరియు ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం భూసేకరణకు  సంబంధించిన భూములలోని ఉద్యాన పంటలకు సంబంధించి ఉద్యాన శాఖ మరియు ఇతర పంటలకు సంబంధించిన విలువలను అటవీశాఖ అధికారులు త్వరితగతిన లెక్కింపు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా ఎంత  విస్తీర్ణంలో ఉద్యాన పంటలు ఉన్నాయో సవివరంగా ఉండాలని ఆయన స్పష్టం చేసారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం అదనపు సి.ఇ బంగారు శెట్టి మాట్లాడుతూ టౌన్ షిప్ కోసం 350 ఎకరాలు, ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణానికి 213 ఎకరాలు అవసరమని జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ కృపాకర్ గుండాల, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, రెవిన్యూ డివిజనల్ అధికారి     ఐ. కిషోర్, కొవ్వాడ యూనిట్  ప్రత్యేక ఉపకలెక్టర్ బి.శాంతి, సర్వే మరియు భూరికార్డుల శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం  కార్యనిర్వాహక ఇంజినీర్ దేవర, రణస్థలం తహశీల్దార్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.