ఏయూలో పనిచేయడం పెద్ద వరం..


Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-09-30 18:26:34

ఆం‌ధ్రవిశ్వవిద్యాలయంలో పనిచేయడం పెద్ద వరమని ఏయూ జర్నలిజం విభాగాధిపతి ఆచార్య పి.బాబి వర్థన్‌ అన్నారు. బుధవారం ఉదయం ఏయూ జర్నలిజం విభాగంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ ఆత్మీయ సత్కార సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుటుంబం చాలా పెద్దదని, నా వద్ద చదువుకున్న ప్రతీ విద్యార్థి తన కుటుంబంలో భాగమేనన్నారు. అక్షరాన్ని నమ్ముకుని తాను జీవించారన్నారు. అక్షరాన్ని గౌరవిస్తానన్నారు. ఏయూ జర్నలిజం విభాగంలో ఆరంభ అధ్యాపకునిగా తాను చేరడం తన అద్రుష్టమన్నారు. తనకు స్నేహితులే ఆత్మబంధువులన్నారు. కష్టించడానికి ప్రత్యామ్నాయం లేదన్నారు. శ్రీశ్రీ, ఆత్రేయ, జాలాది వంటి వారితో పరిచయాలు గుర్తుచేసుకున్నారు. ధైర్యంగా, స్థిరంగా తన భావాలను చెప్పడం చిన్నతనం నుంచి తనకు అలవాటన్నారు. కవితలు, సినీ గీతాలు, రచనలు చేసిన సందర్భాలను వివరించారు. క్రమశిక్షణతో పెరిగిన జీవనం, చదవుకునే సమయంలో ఎదురైన సందర్భాలు గుర్తుచేసుకున్నారు. విభాగాచార్యులు డి.వి.ఆర్‌ ‌మూర్తి మాట్లాడుతూ పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆచార్య బాబి వర్ధన్‌తో తనకు 36 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. విద్యార్థులుగా, సహోద్యోగులుగా ఈ అనుబంధం కొనసాగిందన్నారు. పుస్తకాలే తమకు నిజమైన సంపదగా నిలచాయన్నారు. కార్యక్రమంలో ఆచార్య చల్లా రామక్రిష్ణ ప్రసంగించారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా డాక్టర్‌ ‌జి.కె.డి ప్రసాద్‌ ‌వ్యవహరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ‌కె.రామచందర్‌, ‌డాక్టర్‌ ‌నిర్మల తదితరులు పాల్గొన్నారు. విభాగ విద్యార్థులు, పరిశోధకులు, పాత్రికేయులు హాజరై ఆచార్య బాబి వర్ధన్‌ ‌దంపతులను సత్కరించారు.