బాధ్యతగా పనిచేయకపోతే ఇంటికే..


Ens Balu
3
చీడికాడ
2020-09-30 18:56:51

సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, లేనట్లయితే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ప్రభుత్వ విప్, మాడుగుల శాసనసభ్యులు బూడి ముత్యాలనాయుడు తో కలిసి చీడికాడ మండలం జె. బీ.పురం, జి.కొత్తపల్లి, కోనాం గ్రామాలలో పర్యటించారు. గ్రామ సచివాలయ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామంలోని అర్హులందరికీ తప్పక అందేలా చూసే బాధ్యత సచివాలయ ఉద్యోగుల దేనని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏమిటి, వాటికి కావలసిన అర్హతలు ఏమిటి, సచివాలయం నిర్వహించే విధులు ఏమిటి అని వారిని ప్రశ్నించారు. వార్డు వాలంటీర్లు చేయవలసిన పనుల గురించి సమీక్షించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగులు వార్డు వాలంటీర్ల విధి నిర్వహణ కు  సూచనలు చేశారు. ఆశ కార్యకర్తల తో కూడా మాట్లాడి వారు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణ సంతృప్తిగా ఉన్నదా అని అడిగారు.  అనంతరం కోనాం జలాశయాన్ని సందర్శించారు. ప్రస్తుతం నీటిమట్టం వివరాలు, గతంలో ఎంత నీరు వచ్చినది, గతంలో సంభవించిన పరిస్థితులు ను గూర్చి అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ పర్యటనలో అనకాపల్లి ఆర్డిఓ సీతారామారావు తాసిల్దార్ అంబేద్కర్ తదితర అధికారులు నాయకులు పాల్గొన్నారు.