అక్టోబరు 15నాటికి నాడు-నేడు పూర్తికావాలి..
Ens Balu
3
Vizianagaram
2020-09-30 20:39:23
విజయనగరం జిల్లాలో నవంబరు 2న పాఠశాలలు ప్రారంభం కానున్న దృష్ట్యా అక్టోబరు 15 కల్లా నాడు నేడు పనులు పూర్తి కావాలని జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్ ఆదేశించారు. బుధవారం మండల స్దాయి అధికారులతో ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలపై కలక్టరు కేంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాడు నేడు కింద మొదట స్లాబ్ లు లేని టాయిలెట్లకు స్లాబ్ లు వేయించాలని, రన్నింగ్ వాటర్, త్రాగునీరు, విద్యుద్దీకరణ, ప్రహారీగోడలు త్వరగా పూర్తయ్యేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి ఇ-క్రాఫింగ్, రైతుల రిజిస్ట్రేషన్ పూర్తి చెయ్యాలన్నారు. గోడౌన్ లు త్వరలో ప్రారంభం కావాలన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రం దగ్గరలో ఒక ఎకరా వరకు స్ధలాన్ని గుర్తించి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలకు అప్పగించాలన్నారు. మండలస్ధాయి వ్యవసాయ సలహా బోర్డులను ఏర్పాటు చెయ్యాలన్నారు. ఉపాధి హామి ద్వారా చేపడుతున్న కన్వర్జన్స్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను సంయుక్త కలక్టర్లు తనిఖీచేసి నివేదికలను పంపాలన్నారు. సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ ను తప్పనిసరి చెయ్యాలన్నారు. చిరు వ్యాపారులకు అందజేసే వడ్డీ లేని రుణాలు కోసం ఉద్దేశించిన జగనన్న తోడు పధకం కోసం ఏర్పాట్లును చెయ్యాలన్నారు. వైఎస్ఆర్ బీమా పధకం లబ్ధిదారులు అందరికీ జన్ధన్ ఖాతాలను తెరవాలన్నారు. కోవిడ్ నియంత్రణపై మాస్కే కవచం అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 104 కాల్ సెంటర్ నెంబర్లను, కోవిడ్ ఆసుపత్రుల, నోడల్ అధికారుల వివరాలను ప్రదర్శించాలన్నారు. అక్టోబరు 5న విద్యా కానుక ప్రారంభం కానున్నదని, ఈ పధకం కింద విద్యార్దులకు యానిఫారాలు, బూట్లు, సాక్సులు, స్కూల్ బేగ్, టెక్ట్ పుస్తకాలు తదితర సామగ్రి పంపిణీ చేయుటకు ఎంఇఓలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను సంప్రదించి మండల కేంద్రాలలో పధకాన్ని ప్రారంభించాలని సూచించారు. అక్టోబరు 2న గాంధి జయంతి సందర్భంగా మనం-మన పరిశుభ్రత కార్యక్రమాలు ప్రజా ప్రతినిధులతో ఘనంగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా అక్టోబరు 2 గాంధి జయంతి సందర్భంగా గిరిజనులకు పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉండాలన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం 1వ తేదీన మొదటి గంటలోపే పూర్తిచేసి ఎప్పటిలాగే రాష్ట్రంలో మొదటి స్ధానంలో ఉండాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలక్టర్లు ఆర్. మహేశ్ కుమార్, జె. వెంకటరావు, జిల్లా పంచాయతీ అధికారి కె. సునీల్ రాజ్ కుమార్, డిఆర్డిఎ పిడి కె. సుబ్బారావు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఇ పప్పు రవి, జిల్లా విద్యా శాఖాధికారి జి. నాగమణి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.