మల్టీపర్పస్ కేంద్రాలకు స్థలాలు గుర్తించండి..


Ens Balu
5
కలెక్టరేట్
2020-09-30 20:47:48

అనంతపురం జిల్లావ్యాప్తంగా రైతుల పంట ఉత్పత్తులను నిల్వ ఉంచుకునేందుకు, గ్రేడింగ్ చేసేందుకు కోసం ఏర్పాటు చేస్తున్న మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ ల కోసం, అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు వెంటనే నిర్ధేశిత సమయం లోపు స్థలం గుర్తింపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ క్రాప్ బుకింగ్, క్రాఫ్ డైవర్సిఫికేషన్, మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ లు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణం తదితర అంశాలపై వ్యవసాయ అధికారులు, తహసీల్దార్ లు, ఆర్డీఓ లు, సీడీపీఓలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 436 మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ లను అర ఎకరా నుంచి ఒక ఎకరా స్థలంలో ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తింపు వెంటనే పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల పక్కన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ లను ఏర్పాటు చేసేందుకు 15 రోజుల్లోపు స్థలం గుర్తింపు పూర్తి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. అందుకనుగుణంగా 436 మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని, ప్రతి రైతు భరోసా కేంద్రం స్థాయిలో రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వచేసేందుకు, గ్రౌండింగ్ చేసేందుకు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో 7 మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ లను ఏర్పాటు చేసేలా రైతు భరోసా కేంద్రాల పక్కన స్థలం గుర్తించాలని, సంబంధిత ఆర్డీవోలు, తహశీల్దార్లు ఆర్ బి కేల పక్కన స్థలం ఎంత ఉంది అనేది గుర్తించాలన్నారు. వ్యవసాయ అధికారులు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ కోసం అవసరమైన స్థలం కోసం ప్రత్యేక దృష్టి సారించి తహసీల్దార్ లతో సమన్వయం చేసుకొని స్థలం గుర్తించేలా చూడాలన్నారు.  శెనగ పంట స్థానంలో ఇతర పంటల సాగు పై రైతులకు అవగాహన కల్పించాలి : జిల్లాలోని 24 మండలాలలో నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్న పప్పు శెనగ పంట సాగు స్థానంలో ఇతర పంటలైన జొన్న, పొద్దుతిరుగుడు తదితర పంటల సాగు చేసేందుకు (క్రాఫ్ డైవర్సిఫికేషన్) పంట మార్పిడి కింద రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పంట మార్పిడి కి సంబంధించి రైతులకు అర్థమయ్యే విధంగా కరపత్రాలు సిద్ధం చేసి రైతులకు పంపిణీ చేసి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని 24 మండలాల్లో పప్పు శెనగ పంటను 91,877 హెక్టార్లలో సాగు చేస్తున్నారని,  పప్పు శెనగ పంటకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారని, ఈ విషయాన్ని రైతులకు తెలియజేసి పప్పు శెనగ స్థానంలో ఇతర పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇతర పంటల సాగుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది, మార్కెట్ ధరలు తదితర అన్ని రకాల వివరాలు రైతులకు అర్థమయ్యేలా తెలియజేసి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ అసిస్టెంట్లకు సూచించారు. అలాగే వర్షాకాలంలో పంటనష్టంకు సంబంధించి క్షేత్రస్థాయిలో అన్ని పరిశీలించిన తర్వాత నష్టం వివరాలను ప్రతిపాదించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటేనే పూర్తి స్థాయిలో పంట నష్టం వివరాలు ప్రభుత్వానికి అందజేయాలన్నారు. అలాగే జిల్లాలో ఈ క్రాఫ్ బుకింగ్ కు సంబంధించి వెంటనే పూర్తిస్థాయిలో పంట నమోదును పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో మొక్కజొన్న, రాగి, సజ్జ పంటలను మద్దతు ధరతో సేకరించేందుకు రైతులచే రిజిస్ట్రేషన్ లు చేయించాలి : అలాగే రైతు భరోసా కేంద్రాల స్థాయిలోనే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న, రాగి, సజ్జ పంటలను మద్దతు ధరతో సేకరించేందుకు అక్టోబర్ 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు రైతులచే రిజిస్ట్రేషన్ లు చేయించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని, రైతు భరోసా కేంద్రాల పరిధిలో 30 శాతం పంట ఉత్పత్తులను మద్దతు ధరతో సేకరించాలన్నారు. ఇందుకు సంబంధించి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు.  రైతు భరోసా కేంద్రాలలో సీఎం యాప్ ద్వారా రైతుల రిజిస్ట్రేషన్లను చేయాలని, ప్రభుత్వ నిబంధనలను ప్రతి రైతు భరోసా కేంద్రం స్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.  వ్యవసాయ అధికారులు మానవత్వంతో ప్రత్యేక దృష్టి సారించి చిన్న, సన్నకారు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. గ్రామ అగ్రికల్చర్, హార్టికల్చర్, సిరికల్చర్ అసిస్టెంట్లు రిజిస్ట్రేషన్లను సక్రమంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయమై ఎడి ఎలు, వ్యవసాయ అధికారులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను వేగవంతం చేయాలి : జిల్లా వ్యాప్తంగా 800 రైతు భరోసా కేంద్రాలను మంజూరు చేశామని, పునాదుల స్థాయిలోనే ఉన్న ఆర్ బి కె భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 516 రైతు భరోసా కేంద్రాలు ఇంకా నిర్మాణాలు ప్రారంభించలేదని, వెంటనే వారం రోజుల్లోపు నిర్మాణాలు ప్రారంభించేలా ఏడీ ఎలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భవనాల నిర్మాణంలో సమస్యలు పరిష్కరించి ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే భవనాల నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి రోజూ పురోగతిని రిపోర్టు రూపంలో అందించాలన్నారు. 7వ తేదీ లోపు అన్ని అంగన్వాడీ భవనాలకు స్థలం గుర్తింపు పూర్తి కావాలి: జిల్లా వ్యాప్తంగా 1146 అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు సంబంధించి అక్టోబర్ 7వ తేదీ లోపు స్థలం గుర్తింపు పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే నెల 7వ తేదీ లోపు 100 శాతం స్థలం గుర్తింపు పూర్తి కావాలని సీడీపీఓ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతి రోజూ ఎన్ని అంగన్వాడీ భవనాలకు స్థలాల గుర్తింపు పూర్తయిందో వివరాలు తనకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని ఎన్ ఐసి భవనం నుంచి  వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ( గ్రామ/ వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, ఐసిడిఎస్ పిలిచిన చిన్మయా దేవి, మార్కెటింగ్ శాఖ ఏడి నారాయణ మూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.