రక్తదాతలే నిజమైన హీరోలు..
Ens Balu
5
Vizianagaram
2020-10-01 14:55:35
ప్రతి ఒక్కరూ తమకు తాముగా రక్తదానం చేయడంతోపాటు ఇతరులను రక్తదానం చేసేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. రక్తదానం చేయడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో రక్తం అవసరమైన వారికి కావలసిన బ్లడ్ గ్రూపు రక్తం అందుబాటులో ఉండటంవల్ల ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చన్నారు. రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడవని, పైగా కొత్తరక్తంతో మరింత ఉత్సాహంగా వ్యక్తులు రూపొందుతారని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం సందర్భంగా నగరంలోని యూత్ హాస్టల్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను కలెక్టర్ అభినందించారు. జిల్లాలో మూడు అంశాలపై విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నామని రక్తదానాన్ని ప్రోత్సహించడం, నీటిని సంరక్షించడం, చెట్లను సంరక్షించడం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నట్టు పేర్కొన్నారు. రక్తదానంలో పాల్గొన్న వారికి కలెక్టర్ ప్రశంసాపత్రాలను బహూకరించారు. జిల్లాకు చెందిన నా ఊరు విజయనగరం, చేయూత ఫౌండేషన్ సొసైటీ, డబ్ల్యు.ఏ.టి.సర్వీస్ సొసైటీ తదితర నాలుగు సంస్థల ప్రతినిధులు ఈ శిబిరంలో రక్తదానం చేశారు.
అనంతరం యూత్ హాస్టల్ ఆవరణలో గతంలో నాటిన మొక్కల పరిస్థితిని పరిశీలించి వాటి సంరక్షణలో భాగంగా పాదులు కట్టే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని స్వయంగా మొక్కలకు పాదులు కట్టారు. ఈ కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ కె.ఆర్.డి.ప్రసాదరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు బి.రామకృష్ణారావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పృథ్వీ, నవీన్, మోహన్, రాము, సాయిప్రసాద్, నాగేశ్వరరావు, ఫణికుమార్, రెడ్ క్రాస్ సిబ్బంది గౌరీశంకర్, చంద్రరావు, ఎన్.ఎస్.ఎస్. డిపిఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.