రేపటితో గ్రామసచివాలయాలకు ఏడాది..
Ens Balu
4
Vizianagaram
2020-10-01 18:30:04
అసలుసిసలు గ్రామ స్వరాజ్య వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయ్యింది. జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినోత్సవం రోజు అక్టోబరు 02 న గతేడాది రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ప్రారంభమయ్యింది. అంతకు కొద్దిరోజులముందు ఆగస్టు 15న వాలంటీర్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ముంగిటి కే వచ్చి చేరాయి. వినూత్నంగా, ప్రయాగాత్మకంగా అమల్లోకి వచ్చిన ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. జిల్లాలో గత అక్టోబరు 2వ తేదీన 664 గ్రామ సచివాలయాలు, 114 వార్డు సచివాలయాలు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా సుమారు 500కు పైగా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల చెంతకు చేరాయి. మరిన్ని సేవలు త్వరలో అందనున్నాయి. గతంలో ఏ ప్రభుత్వ సేవ కోసమైనా మండల కేంద్రాల్లోని తాశీల్దార్ కార్యాలయాలకు, మీ- సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పడు గ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేయడంతో, ప్రజలు ఊరు దాటాల్సిన పని లేకుండా పోయింది. ప్రతీ సచివాలయంలో గ్రామ కార్యదర్శి, మహిళా పోలీసు, వెల్ఫేర్ అసిస్టెంట్, రెవెన్యూ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టీ కల్చర్ అసిస్టెంట్, ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, ఎఎన్ఎం తదితర దాదాపు 12 మంది ఉద్యోగులు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, అడంగల్ కాపీ, పుట్టిన రోజు ధృవీకరణ పత్రం తదితర ఎన్నో రకాల పత్రాలు పొలిమేర దాటకుండానే పొందే అవకాశం కలిగింది. ఇప్పుడు అన్ని సచివాలయాలకూ సొంత భవనాలు శరవేగంగా, ఆధునిక హంగులతో నిర్మితమవుతుండటం, ఈ వ్యవస్థ అమలుపట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్దికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. జిల్లాలో సచివాలయ వ్యవస్థ ఎంతో గొప్పగా పనిచేస్తోంది. సేవలను అందించడంలో రాష్ట్రంలోనే నెంబరు 1గా నిలిచింది. ఇప్పటివరకు 4,74,025 దరఖాస్తులు సచివాలయాలకు అందగా, వీటిలో 3,91,301 పరిష్కరించడం ద్వారా, 86.52శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. జిల్లాకు మొదటి ఫేజ్‌లో 5,432 మంది సచివాలయ సిబ్బందిని నియమించారు. తాజాగా 1,134 ఖాళీలకు ఇటీవల భర్తీ ప్రక్రియ చేపట్టగా, 45,475 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే తొలిదశలో 10,973 మంది గ్రామ వాలంటీర్లు, 2,127 మంది వార్డు వాలంటీర్లను నియమించారు. వాలంటీర్ల ఖాళీలను కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నారు.
వాలంటీర్లయితే గ్రామానికి తలలో నాలుకలా మారారు. గ్రామాల్లో ప్రతీ 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతీ వంద ఇళ్లకూ ఒక వాలంటర్‌ను నియమించారు. వీరంతా ప్రజల ఇళ్లవద్దకే వెళ్లి సేవలందిస్తున్నారు. ప్రతీనెలా ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ సేవలన్నీ నిర్ణీత కాలవ్యవధిలో ఇంటివద్దనే అందజేస్తున్నారు. గతంలో రేషన్ కార్డు కోసం ఏళ్లతరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు కేవలం ధరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అర్హులైన వారందరికీ బియ్యం కార్డులు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డును ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటికే పంపించింది. వైఎస్ఆర్ బీమా కార్డు కూడా ఇంటికే వచ్చింది. తరచూ వాలంటీర్లు ఇళ్లవద్దకు వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితిని సైతం వాకబు చేస్తున్నారు. దీంతో గ్రామ సచివాలయ వ్యవస్థ సామాన్యులకు గొప్ప సంతృప్తిని ఇస్తుండగా, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశాన్ని తమకిచ్చినందుకు సచివాలయ సిబ్బంది నుంచీ, వాలంటీర్ల నుంచి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి పట్లా కృతజ్ఞతా భావం వ్యక్తమవుతోంది.